చంద్రబాబు ప్రమాణం 9 న!
ABN, Publish Date - Jun 05 , 2024 | 05:43 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
{ ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11.53 గంటలకు ఆయన పదవీప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయు. పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. 12న కూడా ఒక ముహూర్తాన్ని వారు సూచించారు. కానీ మరీ ఆలస్యమవుతుందని టీడీపీ ముఖ్యులు వద్దనుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార స్థలంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. మంగళగిరికి తూర్పు దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని వాస్తు పండితులు సలహా ఇచ్చారు. ఆ దిశలో విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి పక్కన అనువైన మైదానం కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా.. బాబును లాంఛనంగా కూటమి నేతగా ఎన్నుకోవడానికి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏడో తేదీన నిర్వహించే అవకాశం ఉంది. బాబును శాసనసభలో తమ నేతగా ఎన్నుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ అందిస్తారు. ఆయన్నుంచి ఆహ్వానం అందాక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇంకోవైపు.. ఆయన, జనసేనాని పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశానికి రావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆహ్వానించారు.
నాలుగోసారి సీఎంగా..
చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా మొదటిసారి, 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఎన్నికల్లో గెలిచి మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు నాలుగోసారి కాబోతున్నారు. ఎన్టీఆర్ కూడా టీడీపీ తరపున 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా ఆయన ఇంతకాలం పదవిలో కొనసాగలేదు.
Updated Date - Jun 05 , 2024 | 05:44 AM