ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu : మోయలేనంత భారముంది!

ABN, Publish Date - Jun 26 , 2024 | 02:39 AM

రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఎంత కష్టమైనా భరిస్తా: చంద్రబాబు

‘రాష్ట్రంలో పరిస్థితులు మీరు అనుకున్నంత ఆశాజనకంగా ఏమీ లేవు. ఖజానా ఖాళీగా ఉంది. మోయలేనంత భారముంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా పరిపాలిస్తావని అందరూ అంటున్నారు. నాకు మనోధైర్యం ఉంది. కష్టాలు చూసి పారిపోయేవాడిని కాను. ఎంత కష్టమైనా పడతా.. ఎంత భారమైనా మోస్తా’

-చంద్రబాబు

పరిస్థితులు ఆశాజనకంగా లేవు.. ఖజానా ఖాళీ

కష్టాలు చూసి పారిపోయేదే లేదు

రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ తిరగరాయబోతున్నాను

అప్పులు, అక్రమాలపై 7 శ్వేత పత్రాలు

ఇచ్చిన హామీల మేరకు ఐదు సంతకాలు

పాస్‌పుస్తకాలపై ఇక జగన్‌ బొమ్మలుండవు

మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన

హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పరిశీలన

కుప్పం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వచ్చారు. భారీవర్షం కురుస్తున్నా.. కుప్పం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు, బలహీన వర్గాలకు అవకాశమిచ్చామని.. 164 మంది కూటమి అభ్యర్థులను ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని తెలిపారు. వైసీపీ ఉంటే తమకు భవిష్యత్‌ ఉండదని వారు భయపడ్డారని చెప్పారు. కొత్త కేబినెట్‌లో 8 మంది బీసీలకు మంత్రులుగా స్థానం కల్పించామన్నారు. ప్రమాణం చేసిన వెంటనే పోలవరం, అమరావతిని సందర్శించానని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు 5 హామీలపై సంతకం చేశానన్నారు. ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, నాసిరకం మద్యం అమ్మకాలు, భూగర్భ ఖనిజాల వంటి 7 అంశాలపై త్వరలో శ్వేతపత్రాలను విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులకు పింఛన్లను ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. రూ.4 వేలకు పెంచిన పింఛన్‌ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికొచ్చి ఇస్తామన్నారు. ‘ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజలు తోడు ఉండాలి. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు మోసం. ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం. మీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలపై జగన్‌ ఫొటో తీసేసి, మళ్లీ రాజముద్రతో పంపిణీ చేస్తాం. త్వరలో 283 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం’ అని వివరించారు.

ఏడాదిలోగా కుప్పానికి హంద్రీనీవా జలాలు

సొంత నియోజకవర్గానికి సీఎం అనేక హామీలిచ్చారు. ఏడాదిలోగా నియోజకవర్గానికి హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్‌ ద్వారా నీళ్లు తెస్తానన్నారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతాను. నేను మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. 8 సార్లు కుప్పం నుంచే గెలిపించారు. వచ్చే ఐదేళ్లలో వారి రుణం తీర్చుకుంటా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసం వచ్చాను. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ, రింగు రోడ్డు, కార్గో విమానాశ్రయం, కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తా’ అని తెలిపారు.


నా మెజారిటీ 48 వేలేనా?

‘ఓట్లు.. గుద్దారు. అంతా వన్‌ సైడ్‌. రాష్ట్రమంతా ఒక ఊపు ఊపింది. కానీ కుప్పంలో 48 వేలేనా’ అని నియోజకవర్గ ప్రజల ఎదుట చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగం హఠాత్తుగా టీడీపీ కూటమి ప్రభజనంవైపు మళ్లింది. ‘గాజువాకలో 95 వేలు మెజారిటీ. భీమిలిలో 92 వేలు.. మునుపెన్నడూ గెలవని మంగళగిరిలో లోకేశ్‌కు 91 వేల మెజారిటీ.. పవన్‌ కల్యాణ్‌కు 71 వేలు. నేనే ఆశ్చర్యపోయాను. రాష్ట్రమంతా టీడీపీ సునామీ. మరి ఇక్కడెంత.. 48 వేలా’ అంటూ అంతటితో ఆపేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వన్‌ సైడ్‌ అయిందని.. మహిళలు, బీసీలు కూడా ఏకపక్షంగా వేశారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే గుర్తు పెట్టుకుంటారని, తాత్కాలికంగా కాకపోయినా, దీర్ఘకాలంలో అటువంటివారికి మంచే జరుగుతుందని అన్నారు. ‘మా ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడైనా బయటకు రావడం చూశారా? భువనేశ్వరి వచ్చి ప్రచారం చేసింది. వీళ్లు చేసిన అరాచకానికి తప్పలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంకు ఘనస్వాగతం..

ఐదేళ్ల తర్వాత సీఎం హోదాలో కుప్పం వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు జనం పోటెత్తారు. పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీలో హెలిప్యాడ్‌ వద్ద జిల్లా నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయల్దేరి శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న తన ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. అదే మండలం జల్లిగానిపల్లె, చిన్నారిదొడ్డి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి కుప్పం వస్తుండగా తుమ్మిసి రోడ్డు వద్ద చంద్రబాబును చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయన కాన్వాయ్‌ ఆపి వాహనంలో నుంచి దిగి వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

రాజధానికి డ్వాక్రా మహిళల భారీ విరాళం

రాజధానినిర్మాణానికి చిత్తూరు జిల్లాకు చెందిన గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల్లోని 4.30 లక్షల మంది మహిళల తరఫున సీఎం చంద్రబాబుకు రూ.4.50 కోట్ల మెగా చెక్కును అందించారు. అలాగే రాజధాని కోసం ఆనందరెడ్డి రూ.5 లక్షలు, కిరణ్‌కుమార్‌ రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు.

Updated Date - Jun 26 , 2024 | 02:39 AM

Advertising
Advertising