Chandrababu : రాష్ర్టాన్ని పునర్నిర్మిస్తాం
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:37 AM
వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అలాగని భయపడి వెనక్కి తగ్గం. రాష్ర్టాన్ని తిరిగి నిలబెడతాం.
గాడిన పెట్టేవరకూ సమష్టిగా పనిచేస్తాం
తప్పులు చేసేవారిని ఉక్కుపాదంతో అణిచేస్తాం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అలాగని భయపడి వెనక్కి తగ్గం. రాష్ర్టాన్ని తిరిగి నిలబెడతాం. పునర్నిర్మాణం చేస్తాం. రాష్ర్టాన్ని గాడిలో పెట్టేవరకూ కూటమిలోని పార్టీలన్నీ సమష్టిగా పనిచేస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకేసారి అన్నీ చేసేస్తామని చెప్పలేమని, అలాగని రాష్ర్టాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడపడం అసాధ్యమేమీ కాదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంగళవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. మొదటి ఐదేళ్లు అమరావతి రాజధానిగా ఉంది. గత ఐదేళ్లూ మూడు రాజధానుల ముచ్చటతో కాలం గడిపారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేశారు. చివరికి బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి వచ్చింది. అందరం కలిసి ఏపీని అగ్రస్థానానికి చేర్చాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.
నా జీవితంలో చూడని విజయం
‘‘ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నా జీవితంలో చూడలేదు. 93శాతం సీట్లు సాధించి సునామీ లాంటి విజయం సాధించాం. ప్రజలు కసిగా ఓట్లేశారు. విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓట్లేసి వెళ్లారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. గత ఐదేళ్లు ప్రజలు చీకటి రోజులు చూశారు. వారి మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా పార్టీ నాయకులను మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా వేధించారు. చివరికి మీపై(సభాపతిని ఉద్దేశించి) కూడా అత్యాచార యత్నం కేసు పెట్టారు. చాలామంది జైళ్లకు వెళ్లారు. రఘురామకృష్ణరాజును ఎంత వేధించారో అందరం చూశాం. వ్యవస్థలను ఎంతలా విధ్వంసం చేశారనే దానికి ఇదొక నిదర్శనం.’’
పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు
‘‘ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పెట్టేవారు పారిపోయేలా చేశారు. అమరరాజా వారిని వేధించి పక్క రాష్ట్రం వెళ్లేలా చేశారు. అమరావతిని చంపేశారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. కొత్త పెట్టుబడులు సాధించకపోగా, ఉన్నవాటిని తరిమేశారు. అమరావతి పూర్తయి ఉంటే 2 నుంచి 3లక్షల కోట్ల సంపద వచ్చేది. అప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. టీడీపీ హయాంలో 72శాతం పోలవరం పూర్తిచేశాం. అంతే వేగంగా పనులు చేసి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ కావాలని కాంట్రాక్టరును మార్చారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ డయాఫ్రం వాల్ కట్టాలని నివేదిక వచ్చింది. రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేయలేదు. చివరికి గేట్లు కొట్టుకుపోతే కొత్తవి పెట్టలేకపోయారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో క్రైం రేటు భారీగా పెరిగింది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి నిన్న జగన్ పక్కన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డు ప్రదర్శిస్తున్నాడంటే ఇంకేం చెప్పాలి? గత ప్రభుత్వంలో నన్నూ అసెంబ్లీలో అవమానించారు. నా జీవితంలో బాధపడిన రోజు అదే. ఆ కౌరవ సభను గౌరవ సభగా మార్చి ఇక్కడకు వస్తానన్నా. పవన్‌ను వ్యక్తిగతంగా లెక్కలేనన్ని సార్లు విమర్శించారు.’’
రిషికొండపై హౌస్ కమిటీ
‘‘రిషికొండను కొట్టి రూ.500కోట్ల పర్యాటక శాఖ నిధులతో విలాసవంతమైన ప్యాలె్‌సలు కట్టుకున్నారు. దీనిపై హౌస్ కమిటీ వేస్తాం. ఎమ్మెల్యేలందరినీ అక్కడికి తీసుకెళ్తాం. వాటిని ఏంచేస్తే బాగుంటుందో ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో అడుగడుగునా అవినీతి జరిగింది. ఇసుక, మద్యం, గనులు, భూములు ప్రతిదాంట్లో దోపిడీ చేశారు. రోడ్లకు 85శాతం నిధులు కోత పెట్టారు. దీంతో రోడ్లు బాగుచేయడం ఇప్పుడు సవాలుగా మారింది. ఒక్క గనుల్లోనే రూ.20 వేల కోట్లు తినేశారు. పేదల ఇంటిస్థలాల్లోనూ భారీ అవినీతి జరిగింది. ఢిల్లీకి మించిన లిక్కర్ స్కాం ఏపీలో జరిగింది. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారినెవరినీ వదిలే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారం అందరినీ శిక్షిస్తాం. కక్షలు పెంచుకుంటే, రాష్ట్రం రావణకాష్టం అవుతుంది. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో ఉద్దేశపూర్వకంగా ఫైళ్లు తగలబెట్టారు. తప్పులు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం.’’
పరదాలు కట్టొద్దు
‘‘అదేం పైశాచిక ఆనందమో తెలియదు. గత ప్రభుత్వంలో సీఎం హెలికాప్టర్‌లో వెళ్తుంటే కింద రోడ్డుపై ట్రాఫిక్ ఆపడం, చెట్లు నరికేయడం చూశాం. నాకోసం పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, స్కూళ్లు మూసేయడం, రాజకీయ నాయకుల్ని నిర్బంధించడం లాంటివి చేయొద్దు. ట్రాఫిక్ కూడా ఒకట్రెండు నిమిషాలే ఆపండి. నాపై రాళ్లు వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశంను కూడా ఆ జబితాలో చేర్చారు. అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించారు. పోలవరం నిర్మాణానికి సహకారం అందిస్తామన్నారు. రాష్ర్టానికి గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కేటాయింపులు చూడలేదు. శాసనసభ తరఫున కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ పెడతామని, సూపర్ సిక్స్ హామీలు అమలుచేస్తామని తెలిపారు. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
నా చేతిలో కత్తి పెట్టారు
‘‘హూ కిల్డ్ బాబాయ్?... అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు బాధపడ్డా. మొదట గుండెపోటు అన్నారు. ఆ తర్వాత హత్య అన్నారు. తర్వాత రోజు జగన్ మీడియాలో నా చేతిలో కత్తిపెట్టిన ఫొటో వేశారు. సీబీఐ విచారణాధికారిపై కేసు పెట్టారు. విచారణాధికారి బెయిల్ తెచ్చుకోవడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. చివరికి సీబీఐ అధికారులు అరెస్టు చేయలేని పరిస్థితి సృష్టించారు. నేరస్థుడే సీఎం అయితే పోలీసులూ వంతపాడతారు.’’
పులివెందులలా మార్చాలనుకున్నారు
‘‘పులివెందుల నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఓట్లేసే పరిస్థితి లేదు. వేరే పార్టీకి ఓట్లేస్తే అక్కడ బతకనివ్వరు. రాష్ట్రం మొత్తాన్ని అలాగే మార్చాలనుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించారు. కుప్పం, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో భారీగా డబ్బులు పంపిణీ చేసి మమ్మల్ని ఓడించాలనుకున్నారు. మాచర్ల లాంటి నియోజకవర్గంలోనే మా పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. ఉమ్మడి కడపలో ఏడు స్థానాలు కూటమి గెలిచింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లు నేను మాచర్ల నియోజకవర్గానికి వెళ్లలేకపోయా. కానీ ఇప్పుడు జగన్ వినుకొండ వెళ్తానంటే ఎవరూ అడ్డుకోలేదు. అదీ మీకు మాకు తేడా. 36మందిని చంపేశారు అంటున్నారు. పేర్లు ఇవ్వమంటే మాత్రం మాట్లాడరు.’’
Updated Date - Jul 24 , 2024 | 05:38 AM