పాకిస్తాన్ పేరు మార్చండి మహాప్రభో..!
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:01 AM
ఎవరైనా తాముండే కాలనీ, ప్రాంతం పేరు ఏదైనా తమ కాలనీ పేరు అక్కడి వాసులు గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా కాలనీ వాసులమని గర్వంగా ఫీలవుతారు.
ఎవరైనా తాముండే కాలనీ, ప్రాంతం పేరు ఏదైనా తమ కాలనీ పేరు అక్కడి వాసులు గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా కాలనీ వాసులమని గర్వంగా ఫీలవుతారు. అయితే నగరంలోని ఓ కాలనీవాసులు తమ కాలనీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాముంటున్న కాలనీ పేరు చెప్పకుండా ఫలానా ప్రాంతం పక్కన అనో ఫలానా రోడ్డుకు దగ్గర్లో అనో చెప్పుకుంటారు. అంతే కాదు తమ కాలనీ పేరును మార్చండి మహాప్రభో అంటూ దండాలు పెట్టేస్తారు. ఆఖరికి తమ పిల్లలకు పెళ్లి సంబంధాలు వెళ్లిన సమయంలో అసలు తమ కాలనీ పేరే చెప్పుకోరు. ఇంతకీ అక్కడి వారు చెప్పుకోలేనంతగా ఆ పేరులో ఏముందో తెలుసా మన శత్రుదేశమైన ‘పాకిస్తాన్’ అవును నిజమే. పాకిస్తాన్ పేరుతో నగరంలో ఓ కాలనీ ఉంది. అది పాయకాపురం ప్రాంతంలోని నున్న రూరల్ పోలీసు స్టేషన్ వెనుకే ఉంది.
- పాయకాపురం, ఆంధ్రజ్యోతి
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, పాకిస్తాన్ దేశాల మద్య 1971 యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించగా అదే సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విభజించబడింది. దీంతో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అప్పటి ప్రభుత్వం ఆయా కు టుంబాలకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు. అందులో భాగంగా నగరంలోని పాయకాపురం ప్రాంతంలో ఓ చిన్నిపాటి కాలనీ నిర్మించారు. 1984లో 40గృహాలు 3 రోడ్లతో నిర్మించిన కాలనీ 1986లో పూర్తయింది. అప్పట్లో కాలనీకి పాకిస్తాన్ కాలనీగా నామకరణం జరిగింది. అయితే పాకిస్తాన్ సరిహద్దుల నుంచి ఏ ఒక్క కుటుంబం ఇక్కడికి వచ్చి నివాసం ఉండలేదు. దీంతో కాలనీ దెబ్బతిని నిర్మానుష్యంగా మిగిలిపోయింది. 3దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని బుడమేరు వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో అనేక మంది స్థానికులు నిరాశ్రయులయ్యారు. ఇక ఇళ్లు లేక రోడ్ల పక్కన జీవనం సాగించే కుటుంబాలు మనుగడ సాగించడమే కష్టమయిపోయింది. అయితే అప్పట్లో సమీప ప్రాంతాల కన్నా పాకిస్తాన్ కాలనీ కాస్త ఎత్తులో ఉండి వరద ముంపు ప్రభావం తక్కువగా ఉంది. దీంతో అప్పటి అధికారులు పలు కుటుంబాలను కాలనీలోని ఇళ్లకు తరలించారు. అప్పటి నుంచి వారంతా ఆ కాలనీవాసులుగానే ఉండిపోయారు. ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీలో 58 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
ఉద్యోగాలు, లోన్లు, పాస్‌పోర్టు విషయంలో ఇబ్బందులు
కాలనీలో గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలు కొంత అభివృద్ధి చెందారు. అయితే ఉద్యోగాలకు, లోన్లకు, పాస్‌పోర్టు వంటి విషయాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డుల్లో పాకిస్తాన్ ఉండటం శాపంగా మారింది. విదేశాలు వెళ్లాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్‌లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లే యువకుల ఆధార్ కార్డుల్లో పాకిస్తాన్ పేరుండటంతో ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది.
భగీరథ కాలనీగా నామకరణం చేయాలి
ఏకతాటిపైకి వచ్చిన కాలనీవాసులంతా కొన్నేళ్లుగా తమ కాలనీకి భగీరథ కాలనీగా నామకరణం చేయాలని కోరుతున్నారు. అలాగే తమ ఇంటి పన్నులు, ఆధార్ కార్డులు, కరెంట్ బిల్లులతో పాటుగా సమస్త గుర్తింపు కార్డుల నుంచి పాకిస్తాన్ పేరును తొలగించి భగీరథ కాలనీగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని వేడుకుంటున్నారు.
Updated Date - Dec 05 , 2024 | 10:06 AM