రాజముద్రతో 49,535 కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు
ABN, Publish Date - Jul 05 , 2024 | 01:07 AM
వందేళ్ల తర్వాత భూములు రీసర్వే చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. రైతులకు కనీస సమాచారం లేకుండానే హద్దులు పాతారు.
ఫ త్వరలోనే రైతులకు అందజేసేందుకు కసరత్తు
తిరుపతి(కలెక్టరేట్), జూలై 4 : వందేళ్ల తర్వాత భూములు రీసర్వే చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. రైతులకు కనీస సమాచారం లేకుండానే హద్దులు పాతారు. హడావుడిగా సర్వేచేసి పల్లెల్లో భూపంచాయితీలు పెంచారు. కోట్లాది రూపాయలు వెచ్చించి జగన్ ఫొటోతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం చేతిలో పెట్టారు. ‘భూహక్కు’ పత్రమంటూ జగన్ ఫొటోతో ఉన్న పాసుపుస్తకాలు ఇవ్వడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తాము అఽధికారంలోకి రాగానే రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో మాదిరే పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రను మాత్రమే ఉంచాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో భూపరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ జిల్లా అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం భూహక్కు పత్రాలు ఎన్ని పంపిణీ చేసింది. ఇంకా ఎన్ని ఉన్నాయి.. అనే వివరాలు ఆరా తీశారు. ఇప్పటి వరకు జగన్ ఫొటోతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రెండు విడతల్లో 34,120, మూడో విడతలో 15,415 కలిపి మొత్తం 49,535 పంపిణీ చేసినట్లు సీసీఎల్‌ఏ అధికారుల దృష్టికి జిల్లా యంత్రాంగం తీసుకెళ్లింది. వీటన్నింటినీ వెనక్కి తీసుకుని, రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు త్వరలోనే అందజేయనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కాగా జిల్లావ్యాప్తంగా 34 మండలాల్లో మూడు విడతల్లో 320 గ్రామాల్లో భూసర్వే పూర్తయింది. పొలాల సరిహద్దుల్లో 2.50లక్షల రాళ్లను నాటినట్లు జిల్లా సర్వేశాఖ తెలిపింది. అయితే ఆ రాళ్లపైనా జగన్ బొమ్మతో కూడిన పబ్లిసిటీ తగ్గలేదు. దీనిపైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపైనా కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.
Updated Date - Jul 05 , 2024 | 01:07 AM