కొలువుదీరనున్న కొత్త బోర్డు
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:59 AM
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు
- నేడు టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు, 17 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం
తిరుమల, నవంబరు5(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరు బాధ్యతలు స్వీకరిస్తారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా నేడు ప్రమాణం చేస్తారు. తొలుత చైర్మన్, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకాలు చేశాక స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీకి శేషవస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేస్తారు. కాగా సాయంత్రం అన్నమయ్య భవనంలో కొత్త పాలకమండలి మీడియా మీట్‌లో పాల్గొంటుంది. ప్రమాణస్వీకారానికి తగిన ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది.
కొత్త బోర్డులో వీరు..
నూతన బోర్డులో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. జ్యోతుల నెహ్రు(జగ్గంపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(కోవూరు) ఎంఎస్ రాజు(మడకశిర) స్థానం దక్కించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తో పాటు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా కూడా కొత్త పాలకమండలిలో ఉన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన అక్కిన మునికోటేశ్వరరావు, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్, పల్నాడు జిల్లాకు చెందిన జంగా కృష్ణమూర్తి, కుప్పం క్లస్టర్ ఇన్‌చార్జి వైద్యం శాంతారాం, మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఇక జనసేన నుంచి పవన్‌కల్యాణ్ సన్నిహితుడు, తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్‌రెడ్డి, సినీ ఆర్ట్ డైరెక్టర్, పవన్‌కల్యాణ్ స్నేహితుడు బూరగాపు ఆనంద్‌సాయి, జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి కొత్త బోర్డులో చోటు లభించింది. అలాగే ఫార్మా రంగంలో ఉన్న నాట్కో గ్రూప్ వైస్ చైర్మన్ సన్నపనేని సదాశివరావు, ఎన్‌ఆర్‌ఐ జాస్తి పూర్ణసాంబశివరావు, కర్ణాటక పారిశ్రామికవేత్తలు నరే్‌షకుమార్, కాఫీ రంగంలో ప్రముఖుడైన ఆర్‌ఎన్ దర్శన్, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్ సభ్యులుగా నియమితులయ్యారు. ఇక, తమిళనాడుకు చెందిన రామ్మూర్తి, ఎంసీఐ చైర్మన్‌గా పనిచేసిన గుజరాత్‌కు చెందిన కేతన్ దేశాయ్ కుమారుడు అదిత్‌దేశాయ్, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక నిపుణుడు సౌరభ్ బోరా, కేంద్రమంత్రి అమిత్‌షా సన్నిహితుడు కృష్ణమూర్తి వైద్యనాఽథన్ కూడా సభ్యులుగా స్థానం దక్కించుకున్నారు. స్థానికంగా ఉంటూ శ్రీవారి భక్తుల సమస్యలపై నిరంతరం స్పందించే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డి కూడా నూతన బోర్డులో ఉన్నారు.
వీరికి మళ్లీ అవకాశం
తాజా బోర్డులో మరోసారి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారిలో కృష్ణమూర్తి వైద్యనాథన్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సౌరభ్ బోరా, సుచిత్ర ఎల్లా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి సభ్యులుగా ఉన్నారు. ఇక, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ బోరా చివరి రెండు బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. అలాగే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్ర ఎల్లా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఇక, కేంద్ర హోం మంత్రికి సన్నిహితుడుగా పేరున్న చెన్నైకు చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ 2015 నుంచి వరుసగా(ఐదుసార్లు) టీటీడీ బోర్డులో కొనసాగుతున్నారు.
వారసులుగా ఇద్దరు
తిరుప్పుర్ బాలుగా పేరున్న బాలసుబ్రహ్మణియన్ పళణిస్వామి గత ప్రభుత్వంలో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈసారి ఆయన సోదరుడు రామ్మూర్తి బోర్డులో అవకాశం దక్కించుకున్నారు. అలాగే గత బోర్డులో సభ్యుడిగా ఉన్న కేతిన్ దేశాయ్ కుమారుడు, కుసుమ్ ధీరజ్‌లాల్ ఆస్పత్రి ఎండీ అదిత్ దేశాయ్ కి ఈసారి అవకాశం లభించింది.
వైసీపీలో వివాదాల బోర్డులు
జగన్ ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి నియామకాలు వివాదాలమయం అయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించారు. 2019 జూన్ 22 న వైవీ బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల తర్వాత టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అప్పట్లో ప్రభుత్వం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ఆఫీషియో సభ్యులు, ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులతో బోర్డును ఏర్పాటు చేయటంపై కూడా పలువురు భక్తులు విమర్శలు చేశారు. అందులోనూ ప్రత్యేక ఆహ్వానితులతో కూడా ప్రమాణస్వీకారం చేయించి నూతన పద్దతికి తెరతీశారు. 2021లో కేంద్ర క్యాబినేట్‌ను తలపించేలా వైసీపీ ప్రభుత్వం జంబో బోర్డును ఏర్పాటు చేయడంపై కూడా తీవ్రస్థాయిలో దుమారం రేగింది. రాజకీయ పునరావస కేంద్రంగా టీటీడీని మార్చుతూ గత సీఎం జగన్మోహన్‌రెడ్డి 29 మంది సభ్యులు, మరో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఏకంగా 81 మందితో బోర్డును నియమించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు కోర్డును ఆశ్రయించాయి. దీంతో కోర్టు ఆదేశాలతో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి అడ్డుకట్టపడింది. పైగా ఆబోర్డులో ఆరుగురు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు సభ్యులుగా ఉన్నారంటూ అప్పట్లో బీజీపీ కోర్డును కూడా ఆశ్రయించింది. అపార్టుమెంట్ల పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ఆబోర్డులో సభ్యుడిగా ఉన్న లక్ష్మినారాయణ అనే సభ్యుడిని అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు మూడవ బోర్డుకు భూమన కరుణాకర్‌రెడ్డితో సహా 26 మందిని నియమించారు. ఈ పాలకమండలి నిర్ణయాలన్నీ వివాదాస్పదమే అయ్యాయి. రాజకీయలబ్ధి కోసం టీటీడీ నిధులతో తిరుపతిలో మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణాలు, అవసరం లేకపోయిన విశ్రాంతి గృహాల నిర్మాణం వంటివి విమర్శలకు గురయ్యాయి
Updated Date - Nov 06 , 2024 | 12:59 AM