తిరుపతిలో హోటళ్లకు మళ్లీ బాంబు బెదిరింపు
ABN, Publish Date - Oct 27 , 2024 | 01:41 AM
తిరుపతిలోని పలు హోటళ్లకు శనివారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్కు హోటల్ మేనేజర్ సుశాయ్‌కు తెల్లవారుజామున 5.32 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని పలు హోటళ్లకు శనివారం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. కపిలతీర్థం సమీపంలోని రాజ్ పార్కు హోటల్ మేనేజర్ సుశాయ్‌కు తెల్లవారుజామున 5.32 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఆయన అలిపిరి సీఐ రాంకిషోర్‌కు సమాచారం అందించారు. అదే ప్రాంతంలోని మరో రెండు, ఈస్ట్ స్టేషన్ పరిధిలో ఒకటి, రూరల్ పరిధిలోని తాజ్ హోటల్‌కూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లు వెంటనే హోటల్స్ వద్దకు చేరుకున్నాయి. రాజ్ పార్కు హోటల్ వెలుపల పార్క్ చేసి ఉంచిన జమ్మూకాశ్మీర్ రిజిస్ర్టేషన్ కారును తనిఖీ చేశారు. అలాగే రష్యన్లు, మలేషియా వాసులు బసచేసే గదులపై ప్రత్యేక దృష్టి సారించి అడుగుడుగునా తనిఖీలు చేసి, ఎలాంటి బాంబులూ లేవని తేల్చారు. మిగిలిన హోటళ్లనూ తనిఖీ చేసి ఫేక్ మెయిల్స్ అని నిర్థారించుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు నాలుగు హోటళ్లకు, తిరుపతి విమానాశ్రయంలో స్టార్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది.
ఫేక్ మెయిల్స్‌పై లోతైన దర్యాప్తు : ఎస్పీ
తిరుపతిలోని పలు హోటళ్లకు ఫేక్ మెయిల్స్ రావడం పట్ల లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆయా హోటళ్ల మేనేజర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎ్‌స చట్టం 353 క్లాస్ వన్, క్లాస్ బీ, 351 క్లాస్ 4 కింద ఆరు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాంబు బెదిరింపుల వెనుక పాక్ తీవ్రవాదుల హస్తముందా? లేకుంటే వారి పేర్లతో ఫేక్ మెయిల్స్ పెట్టి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మెయిల్స్ వచ్చిన ఐడీలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో నగర ప్రజలు భయడాల్సిన పనిలేదని, అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - Oct 27 , 2024 | 01:41 AM