ఉచిత సిలిండర్లకు నేటి నుంచి బుకింగ్
ABN, Publish Date - Oct 29 , 2024 | 01:54 AM
ఎన్నికల హామీల్లో భాగంగా దీపావళి నుంచి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల్లో భాగంగా దీపావళి నుంచి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనికి మంగళవారం నుంచి లబ్ధిదారులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల రేషన్‌కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారంతా ఈ పథకానికి అర్హులుగా మారనున్నారు. నిత్యావసర సరుకుల భారం పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఈ ఉచిత గ్యాస్ పథకంతో కొంత వెసులుబాటు కలుగుతుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4.48 లక్షల మందికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు అందనున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.839 ఉంది. దూరాన్ని బట్టి రవాణా చార్జీలు అదనంగా ఉంటాయి. ఈ రూ.839లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ.19 రాయితీగా తిరిగి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇది పోను రూ.820 లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఒక్కో సిలిండర్‌కు రూ.820 చొప్పున ఏడాదికి మూడింటికిగాను రూ.2400 లబ్ధి కలగనుంది. ఈ లెక్కన మొత్తం 4.48 లక్షల మందికి ఏటా రూ.110.2 కోట్ల లబ్ధి చేకూరనుంది. కాగా, గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్న వారు ముందుగా సొమ్ము చెల్లించాక వారి వ్యక్తిగత ఖాతాల్లో ప్రభుత్వం నగదు బదిలీ విధానం ద్వారా తిరిగి సొమ్ము జమ చేయనుంది. దీంతో ప్రస్తుతం పాత పద్దతిలోనే సిలిండర్లు బుక్ చేసుకోవాలి.
గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇలా..
మొదటి సిలిండర్‌ను ఈ నెల 29వ తేది నుంచి బుక్ చేసుకోవాలి. రెండో సిలిండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు, మూడవది ఆగస్టు 1 నుంచి నవంబరు 30వ తేదీ లోపు పొందాలి.
నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం
తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి: తెల్లరేషన్‌కార్డు పేదలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మంగళవారం నుంచి అమలుకానుందని జేసీ శుభం బన్సల్ తెలిపారు. ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు, ఆధార్‌కార్డు, బియ్యంకార్డు, ఇతర శాఖల డేటాబే్‌సలో గ్యాస్ కనెక్షన్లు, బియ్యంకార్డు, ఆధార్‌కార్డు సరిపోలి ఉండాలని సూచించారు. అ అర్హతలతో పాటు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధనమైవారు ఉచిత గ్యాస్ కనెక్షన్‌కు అర్హులన్నారు. మొదట గ్యాస్ ఏజెన్సీకి సిలిండర్‌కు డబ్బులు చెల్లిస్తే 48గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమవుతుందన్నారు.
Updated Date - Oct 29 , 2024 | 06:33 AM