ద్రావిడ వర్శిటీలో విచారణ కమిటీ
ABN, Publish Date - Nov 03 , 2024 | 02:50 AM
ద్రావిడ విశ్వవిద్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై శనివారం కమిటీ విచారణ చేపట్టింది.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక తీరుపై సమాచార సేకరణ
గుడుపల్లె, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై శనివారం కమిటీ విచారణ చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. జీతాలు ఇస్తామని చెప్పిన వైసీపీ నాయకులు జీతాలు ఇప్పించలేకపోయారు. దీంతో ఉద్యోగులు రోజూ పరిపాలనా భవనం ఎదుట నిరసన కొనసాగించారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జీతాలు అందజేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలను మంజూరు చేశారు. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై వాస్తవ పరిస్థితులు తెలుసుకొనేందుకు చైర్మన్‌గా వీసీ ఆచార్య దొరస్వామి, సభ్యులుగా ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య షావళ్లీ ఖాన్, ఎస్వీయూ మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్ వరదరాజులను విచారణ కమిటీగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. శనివారం కమిటీ సభ్యులు ద్రావిడ విశ్వవిద్యాలయానికి చేరుకుని వీసీ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్‌లతో సమావేశమయ్యారు. అనంతరం కమిటీ హాలుకు చేరుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై అధికారుల ద్వారా ఫైళ్లు తెప్పించుకొని పరిశీలించారు. రాత్రి వరకు కమిటీ సభ్యులు వారికి కావలసిన సమాచారాన్ని సేకరించారు. కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుందని రిజిస్ట్రార్ తెలిపారు.
Updated Date - Nov 03 , 2024 | 02:50 AM