control-గంజాయి కట్టడి
ABN, Publish Date - Nov 29 , 2024 | 12:30 AM
వైసీపీ హయాంలో విపరీతంగా పెరిగిన గంజాయి రవాణా, అమ్మకాలను పూర్తిగా కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో గంజాయి కనిపించకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది.
ఫ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు
చిత్తూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో విపరీతంగా పెరిగిన గంజాయి రవాణా, అమ్మకాలను పూర్తిగా కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వచ్చే ఆరు నెలల్లో గంజాయి కనిపించకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది.తాజాగా గంజాయి సాగు, రవాణా, విక్రయాల్లో నిందితులకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ప్రకటించింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గంజాయిని ఎలా కట్టడి చేయాలో సూచిస్తూ గురువారం ఉత్తర్వులను విడుదల చేసింది. అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి, డీఎస్పీ ఆధ్వర్యంలో 66మంది సిబ్బంది పనిచేసేలా ఉత్తర్వులిచ్చారు. ఇదే క్రమంలో జిల్లాల్లోనూ డిస్ర్టిక్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. మన జిల్లాలోనూ ఈ సెల్ బాధ్యతలను ఓ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఓ హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లు నిర్వహించనున్నారు.
వైసీపీ హయాంలో పెరిగిన విక్రయాలు
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మన జిల్లాలోనూ గంజాయి అమ్మకాలు, వాడకం విపరీతంగా పెరిగింది.2014-19సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 17 కేసుల్లో 62 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 169 కేసుల్లో ఏకంగా 1166 కిలోల గంజాయిని పట్టుకున్నారు. అప్పట్లో 45 మందిని అరెస్టు చేస్తే.. వైసీపీ హయాంలో 496 మంది అరెస్టయ్యారు.జిల్లామీదుగా సరఫరాతో పాటు జిల్లావాసులు కూడా పెద్దఎత్తున గంజాయి వాడుతున్నారనే విషయం ఆందోళనకు గురి చేస్తోంది. చిత్తూరు, పలమనేరు, పుంగనూరు వంటి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గంగవరం, పెద్దపంజాణి, కుప్పం, రామకుప్పం, వి.కోట వంటి ప్రాంతాల్లో గంజాయిని సాగు కూడా చేసేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో సివిల్ డ్రస్సులు ధరించిన పోలీసు బృందాలు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వి.కోట, రామకుప్పం ప్రాంతాల్లో సాగులో ఉన్న గంజాయి మొక్కలను గుర్తించారు.
ఫ ఇప్పటికే టీమ్ పనిచేస్తోంది
గంజాయిని అరికట్టేందుకు మన జిల్లాలోనూ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేస్తాం.ఇప్పటికే గంజాయిని అరికట్టేందుకు జిల్లాలో టాస్క్‌ఫోర్స్ టీమ్ పనిచేస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటుతో.. గంజాయిని ఓ చోట పట్టుకుంటే దాని చైన్ లింకుల్ని వెతుక్కుంటూ వెళ్లి పూర్తిగా అంతం చేస్తాం.
- మణికంఠ, చిత్తూరు ఎస్పీ
Updated Date - Nov 29 , 2024 | 12:30 AM