ద్రావిడ వర్శిటీలో రూ.2.61 కోట్లు దారి మళ్లింపు
ABN, Publish Date - Nov 18 , 2024 | 01:10 AM
నాలుగేళ్లు ఉద్యోగుల జీఎస్టీ, ఈఎ్‌సఐ చెల్లించని గౌసియా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ
చిత్తూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కుప్పంలోని ద్రావిడ యూనివర్శిటీలో మరో అవినీతి బాగోతం బయటపడింది. ఇక్కడి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన జీఎస్టీ, ఈఎ్‌సఐ నిధుల్ని దారి మళ్లించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరగ్గా.. తాజాగా బయటపడింది. ద్రావిడ యూనివర్శిటీలో 254 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గౌసియా వలంటీర్ సొసైటీ పేరుతో ఓ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ 15 ఏళ్లుగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. వర్శిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం నెలకు సుమారు రూ.43 లక్షల్ని చెల్లిస్తోంది.ఈ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం 12 నెలల జీతాలను పెండింగులో పెట్టగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.2.86 కోట్ల పెండింగు జీతాల్ని విడుదల చేశారు. ఇదిలా ఉండగా, 2019 డిసెంబరు నుంచి 2023 అక్టోబరు వరకు ఉద్యోగులకు సంబంధించిన జీఎస్టీ బిల్లులు రూ.2.54 కోట్లు చెల్లించలేదని.. అలాగే 2019లో మూడు నెలలకు చెందిన ఈఎ్‌సఐ బిల్లులు రూ.7.03 లక్షల్ని చెల్లించలేదని తాజాగా బయటపడింది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘ నాయకులు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి పొక్కింది. దీన్ని చార్టెడ్ అకౌంటెంట్‌తో పలుసార్లు నిర్ధారించుకున్న వర్శిటీ అధికారులు ఏజెన్సీ నిర్వాహకులకు రెండుసార్లు నోటీసుల్ని అందించినట్లు సమాచారం. అయినా ఏజెన్సీ నిర్వాహకులు స్పందించలేదు. అంతేకాకుండా, వైసీపీ హయాంలో వర్శిటీలో కీలకంగా పనిచేసిన అధికారిని కలవడంతో వర్శిటీ ఉద్యోగుల్లో విపరీతంగా చర్చ మొదలైంది. ఈ నిధుల దారి మళ్లింపు వెనుక అప్పటి అధికారుల హస్తం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఈ విషయాన్ని సోమవారం వర్శిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుత రిజిస్ర్టార్ కిరణ్‌ను ఈ విషయమై వివరణ కోరగా.. గౌసియా సొసైటీ వారు జీఎస్టీ, ఈఎ్‌సఐ చెల్లించకుండా పెద్దమొత్తంగా నిధుల్ని పక్కదారి పట్టించినట్లు తేలిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 01:10 AM