Drone శాంతి భద్రతలు, వీఐపీల భద్రతకు డ్రోన్
ABN, Publish Date - Nov 09 , 2024 | 01:24 AM
డ్రోన్.. ఇక పోలీసు శాఖలోనూ భాగంకానుంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని.. భద్రత, ప్రమాదాల నివారణకూ ఉపయోగించుకోనున్నారు. పోలీస్ వెళ్లలేని చోటికి డ్రోన్‌ను పంపనున్నారు. ఇందులోని కెమెరాల ద్వారా నిఘా పెట్టి.. పర్యవేక్షించి.. చర్యలు చేపట్టనున్నారు. దీనికిగాను ప్రయోగాత్మక పరిశీలన మొదలైంది.
డ్రోన్.. ఇక పోలీసు శాఖలోనూ భాగంకానుంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో వినియోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీని.. భద్రత, ప్రమాదాల నివారణకూ ఉపయోగించుకోనున్నారు. పోలీస్ వెళ్లలేని చోటికి డ్రోన్‌ను పంపనున్నారు. ఇందులోని కెమెరాల ద్వారా నిఘా పెట్టి.. పర్యవేక్షించి.. చర్యలు చేపట్టనున్నారు. దీనికిగాను ప్రయోగాత్మక పరిశీలన మొదలైంది.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
చాలీచాలని సిబ్బంది, పెరుగుతున్న నేరాలు, శాంతి భద్రతల కట్టడి పోలీసులకు సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో డ్రోన్ల వినియోగంతో సెక్యూరిటీ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనకు తిరుపతి నుంచే శ్రీకారం చుట్టాలని భావించారు. ప్రాథమికంగా పాకాల సర్కిల్‌లో బుధవారం సీఐ మద్దయ్యాచారి ఆధ్వర్యంలో నేషనల్ హైవేలో డ్రోన్లు వినియోగించి వాహనాల వేగం నియంత్రించడం, వాహనం అధిక లోడుతో ఏమైనా వస్తోందా అనే విషయాలను గుర్తించారు. ప్రయోగాత్మకంగా పరిశీలించి.. ఆ తర్వాత జిల్లా అంతటా వినియోగించాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రధానంగా తిరుపతి, తిరుమల సబ్ డివిజన్ల పరిధిలో నిత్యం వీఐపీల తాకిడి ఉంటుంది. వీరి భద్రత పరంగా ప్రత్యేక నిఘా ఉంచడానికి సిబ్బంది చాలకపోవడంతో డ్రోన్లు వినియోగించి భద్రతా వ్యవస్థను మెరుగుపరచాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. మరోవైపు నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారి, తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ రహదారుల్లోని ప్రధాన కూడళ్లు, నేరో పాయింట్లు, మలుపులు, కిలోమీటర్ల దూరం నేరుగా వున్న రోడ్లలో డ్రోన్లు వినియోగించి ఎక్కడో ఒక చోట కూర్చుని డిజిటల్ వ్యవస్థ ద్వారా వీక్షించి తద్వారా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా శేషాచలం అడవులు నుంచి అత్యధికంగా ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోంది. దీంతో అటవీ ప్రాంతాల్లో డ్రోన్లు పంపి స్మగ్లర్లు ఎక్కడున్నారు? ఎక్కడెక్కడ ఎర్రచందనం వృక్షాలు వున్నాయి? మానవ సంపద అక్రమంగా తరలి పోకుండా కొన్ని కిలోమీటర్ల దూరంలో నుంచి వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఏకాంత కాలనీలు, శివారు ప్రాంతాలు, మాస్ ఏరియాలు, రౌడీయిజం, గూండాయిజం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో వీటిని వినియోగించి కొంతవరకు అదుపు చేయడానికి అవకాశం ఉంటుందని ఓ అధికారి చెప్పారు. అసాంఘిక శక్తుల కదలికలు, గంజాయి విక్రయాలు, వినియోగం, రవాణా, రౌడీలు, కేడీలపై ఎప్పటికప్పుడు నిఘా వుంచడానికి ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న క్రమంలో డ్రోన్ల ద్వారా తెలుసుకోవడానికి ఉన్న సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నారు. తిరుపతి లాంటి నగరంలో ట్రాఫిక్ స్తంభించినప్పుడు, అడ్డదిడ్డంగా వాహనాలు ఆపడం, నడి రోడ్లపై వాహనాలు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి పనులు చేసే వారిని డ్రోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించి.. సంబంధిత పోలీసు సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరం ఉంటుంది. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను డ్రోన్ ద్వారా రోడ్లను చిత్రీకరించి అక్కడ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు వుంటుంది.
ప్రతి సబ్ డివిజన్‌కు ఒక డ్రోన్
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి సబ్ డివిజన్‌కు ఒక డ్రోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్ల ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల రేడియ్‌సతో దాదాపు 300 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగిరి వీడియోగ్రఫీ చేస్తాయి. వాటికంటే ఎక్కువ శక్తిమంతమైన డ్రోన్లు తెప్పించడానికి అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా డ్రోన్లు తెప్పించే ప్రయత్నంలో అధికారులు వున్నారు.
Updated Date - Nov 09 , 2024 | 01:24 AM