'OP' in Ruya-రుయాలో ‘ఓపీ’కకు పరీక్ష
ABN, Publish Date - Nov 07 , 2024 | 01:28 AM
వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రుయాస్పత్రికి వచ్చే రోగుల ‘ఓపీ’కకు పరీక్ష పెడుతున్నారు. ‘ఈ- వైద్యం’ పేరిట ఓపీ నిబంధనలను మార్చడంతో తిప్పలు పడుతున్నారు.
ఫ గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న రోగులు
తిరుపతి(వైద్యం), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి రుయాస్పత్రికి వచ్చే రోగుల ‘ఓపీ’కకు పరీక్ష పెడుతున్నారు. ‘ఈ- వైద్యం’ పేరిట ఓపీ నిబంధనలను మార్చడంతో తిప్పలు పడుతున్నారు. గతంలో ఆధార్.. ఫోను నంబరు, చిరునామా చెబితే ఓపీ ఇచ్చేవారు. రోగుల సహాయకులు క్యూలో నిలబడి ఓపీ తీసుకునేవారు. ఇటీవల ఈ-వైద్యం పేరుతో ఓపీ ఇచ్చే నిబంధనలను అధికారులు మార్చారు. ఆ ప్రకారం.. ఓపీ తీసుకోవాలంటే నేరుగా రోగులే వచ్చి ఓపీ కేంద్రంలో వేలిముద్ర వేయాలి. ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబరుతో మాత్రమే ఓటీపీ విధానంతో ఓపీ తీసుకోవాలి. అసలే జబ్బు చేసి బాధపడే రోగులు ఓపీ కోసం క్యూలో నిలుచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే రోగులు రుయాస్పత్రికి వస్తుంటారు. అటువంటి వారి ఆధార్‌కు ఫోన్ నంబరు అనుసంధానం ఉండదు. ఈ క్రమంలో వారు ఓపీ అందక వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మూడు రోజులుగా ఈ విధానం వలన ఓపీ కేంద్రం రోగులు, వారి సహాయకులతో కిటకిటలాడుతోంది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే ఓపీ సమయం ఉంటుంది. సాధారణ రోజుల్లో ఓపీ కోసం వెయ్యి నుంచి 1,200 మందికి పైగా వస్తుంటారు. సోమ, బుధవారాల్లో ఈ సంఖ్య 1,500 పైగా ఉంటుంది. కొత్త విధానం అమల్లోకి రావడంతో మూడు రోజులుగా 800 మందికి కూడా ఓపీ అందడం లేదు. రోగి పూర్తి వివరాలు నమోదు చేయడంతోపాటు వారి వేలిముద్ర కూడా తీసుకోవాల్సి ఉండటంతో ఒక్కో రోగికి ఓపీ ఇచ్చేందుకు పది నిముషాల సమయం పడుతోంది. సమయం లేక అనేక మంది ఓపీ అందకనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నడవలేని, వృద్ధులు, వికలాంగులు ఓపీ క్యూలో ఇబ్బందులు పడుతున్నారు. రుయా అధికారులు దీనిపై దృష్టి సారించి, రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఓపీ సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Nov 07 , 2024 | 01:28 AM