charges-ఆ అభియోగాలకు వివరణ ఇవ్వండి
ABN, Publish Date - Nov 29 , 2024 | 12:38 AM
జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.ఆయనపై వచ్చిన 9 ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, 10 రోజుల్లోపల వివరణ పంపకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఫ రిటైర్డ్ జడ్పీ సీఈవో ప్రభాకర రెడ్డిని ఆదేశించిన ప్రభుత్వం
ఫ 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
చిత్తూరు రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర రెడ్డిపై వచ్చిన అభియోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.ఆయనపై వచ్చిన 9 ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, 10 రోజుల్లోపల వివరణ పంపకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.2008 నుంచి 2017 వరకు జడ్పీలో ప్రభాకరరెడ్డి సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీడీవోగా ప్రమోషన్ వచ్చి భైరెడ్డిపల్లికి బదిలీ అయినా తిరిగి డిప్యుటేషన్‌పై జడ్పీలోనే ఓఎస్డీగా కొనసాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పెద్దిరెడ్డి అండతో ఏక కాలంలో జడ్పీ ఏవోగా, డిప్యూటీ సీఈవోగా,ఇన్‌ఛార్జి సీఈవోగా పనిచేసిన ఘనత ఆయనది.దాదాపు పదేళ్లు ఏ పార్టీ అధికారంలో వున్నా జిల్లాపరిషత్‌లో ప్రభాకరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. రికార్డు అసిస్టెంట్ నుంచి ఎంపీడీవో వరకూ ఎవరినైనా తనకు నచ్చకపోతే వేధించేవారని, రాత్రి 11 గంటల వరకూ కార్యాలయంలో ఉంచి పనిచేయించేవారని చెప్పుకునేవారు.జడ్పీ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉద్యోగులను వేధించేవారని , చివరకు టాయిలెట్స్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురిచేశారన్న విమర్శలున్నాయి. ప్రభాకర రెడ్డి వేధింపుల కారణంగా నాగలాపురం ఎంపీడీవో బాలగణేష్, జడ్పీలో సీనియర్ అసిస్టెంట్ పురుషోత్తంరెడ్డి, టైపిస్ట్ కెనడి, రికార్ట్ అసిస్టెంట్ యుగంధర్ ఏకంగా ప్రాణాలే కోల్పోయారని జడ్పీ ఉద్యోగులే పీఆర్ కమిషనర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు.రెండు రోజుల్లో రిటైరవుతారనగా ప్రభాకర రెడ్డి సస్పెండయ్యారు. అప్పట్నుంచీ ఆయన ఎవరికీ కనపడలేదు.ఆయనపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.మొత్తం 9 అభియోగాలపై వివరణ ఇవ్వాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జడ్పీ జనరల్ ఫండ్స్ నుంచీ ఎటువంటి ఆమోదం లేకుండా సుమారు రూ.19.19 లక్షలు వి.కోట మండం పట్రపల్లి కొత్తూరులోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయ నిర్వహణకు వెచ్చించడం, జిల్లా పరిషత్‌లో విధుల నిర్వహణకు సుమారు ఐదు అద్దె వాహనాలను వాడి రూ. 17.55 లక్షల అద్దె చెల్లించడం, 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి అత్యధిక శాతం పనులను పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలకే కేటాయించడం, 1124 పనులకు గాను సుమారు రూ.78.13 కోట్లు ఖర్చు పెట్టించడం,జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల నిర్వహణకు సభ్యుల ఆమోదం లేకుండా జనరల్ ఫండ్స్ నుంచి సుమారు రూ.35.61 లక్షలు ఖర్చు చేయడం, జడ్పీ క్వార్టర్స్ మరమ్మతుల కోసం ఒకే పనిని మూడుగా విభజించి ఒక్కో పనికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.15 లక్షలు అంచనా వేసి ఎటువంటి పనులు చేయకుండానే రూ.3.51 లక్షలు చెల్లించడం ఆయనపై వచ్చిన అభియోగాల్లో కొన్ని. జడ్పీలోని కొంత మంది ఉద్యోగులకు ఎటువంటి కారణాలు చూపకుండా వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయలేదని, వేతనాల ఫిక్సేషన్ కూడా ఆలస్యం చేశారని, వారి సర్వీస్ రిజిస్టర్లను ప్రభుత్వానికి పంపలేదని, ఇంకొంత మందికి చివరి వేతన ధ్రువీకరణ పత్రాలను కూడా జారీ చేయలేదని ఆయనపై అభియోగాలున్నాయి.జడ్పీలో పనిచేస్తున్న ముగ్గురు ఏవోలను,ఐదుగురు సిబ్బందిని ఎటువంటి కారణాలు చూపకుండా సస్పెండ్ చేశారని, వారికి సస్సెన్షన్ సమయంలో జీవనాధార భత్యం కూడా మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని కూడా అభియోగాలున్నాయి.
Updated Date - Nov 29 , 2024 | 12:38 AM