లక్షితను చంపిన చిరుత గుర్తింపు
ABN, Publish Date - Mar 20 , 2024 | 12:58 AM
తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల కాలి నడకదారిలో వెళుతున్న నెల్లూరు బాలిక లక్షితపై దాడిచేసి, క్రూరంగా చంపేసిన చిరుతను గుర్తించారు.
మంగళం, మార్చి 19: తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమల కాలి నడకదారిలో వెళుతున్న నెల్లూరు బాలిక లక్షితపై దాడిచేసి, క్రూరంగా చంపేసిన చిరుతను గుర్తించారు. 2023 ఆగస్టులో ఈ హృదయ విదారకమైన ఘటన జరిగింది. వెంటనే స్పందించిన టీటీడీ, అటవీశాఖ అధికారులు దాడి జరిగిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీప ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. వరుసగా ఆరు చిరుతలు చిక్కాయి. వీటినుంచి పలు నమూనాలను, లక్షితకు సంబంధించిన నమూనాలను ల్యాబ్‌కు పంపారు. ముందుగా పట్టుబడ్డ మూడు చిరుత నమూనాల్లో లక్షితను చంపినట్లు ఆధారాలు లభించలేదు. నాల్గవ చిరుత నమూనాల్లో ఆధారాలు లభించాయి. ల్యాబ్ నుంచి ఆధారాలు నెలరోజుల్లో వస్తాయని అటవీశాఖ అధికారులు భావించినా.. దాదాపు ఏడు నెలలు సమయం పట్టింది. కాగా, ముందుగా పట్టుబడ్డ మూడు చిరుతల్లో రెండింటిని జనార్యణానికి దూరంగా అటవీప్రాంతంలో వదలిపెట్టారు. ఓ చిరుతను విశాఖ పట్టణం జూకు తరలించారు. మిగిలినవి జూలోనే ఉన్నాయి. మంగళవారం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టు ఆధారంగా లక్షితను చంపిన నాల్గవ చిరుతను జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీ్‌షకుమార్‌రెడ్డి తెలిపారు. ఎందుకంటే ఈ చిరుత.. జంతువులను వేటాడి తినే పరిస్థితిలో లేదని, కోరపళ్లు నాలుగు రాలిపోయాయన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే జూపార్కులోనే ఉంచాలని నిర్ణయించినట్లు వివరించారు.
Updated Date - Mar 20 , 2024 | 12:58 AM