DSC notification!- డీఎస్సీ నోటిఫికేషన్‌కు వేళయ్యింది!
ABN, Publish Date - Nov 05 , 2024 | 01:11 AM
డీఎస్సీ నోటిఫికేషన్‌ను బుధవారం రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనుంది. టెట్ ఫలితాలు సోమవారం వచ్చిన క్రమంలో డీఎస్సీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473 ఉపాధ్యాయ ఖాళీలు
- ఖాళీల భర్తీతో తగ్గనున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు
చిత్తూరు సెంట్రల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ నోటిఫికేషన్‌ను బుధవారం రాష్ట్రప్రభుత్వం విడుదల చేయనుంది. టెట్ ఫలితాలు సోమవారం వచ్చిన క్రమంలో డీఎస్సీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473 ఖాళీలను అధికారులు గుర్తించారు. హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లను కేటగిరీలవారీగా, ప్రాథమిక పాఠశాలల్లో పోస్టులన్నింటినీ ఎస్జీటీలుగా చూపించారు. స్కూల్ అసిస్టెంట్లను, వ్యాయామ ఉపాధ్యాయులను, సెంకడరీ గ్రేడ్ టీచర్లను, భాషా పండితులను విభాగాలుగా ఖాళీలెన్ని వున్నాయో గుర్తించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన గుర్తించి, వివరాలను విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపారు. నోటిఫికేషన్ వెలువడడానికి ముందు రోస్టర్‌ను నిర్ధారించే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
ఫ డీఎస్సీపై ఆశలతో శిక్షణ
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించకపోవడంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు.కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటన నిర్ణయంతో పరీక్షల కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధిత స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తోంది.వేలాది మంది విద్యార్థులు పలు స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
మొత్తం ఖాళీ పోస్టులు
--------------------------------------------------------------------------------------------------
పోస్టు జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలు మున్సిపల్ స్కూళ్లు మొత్తం
-----------------------------------------------------------------------------------------------------
ఎస్జీటీ 820 110 930
ఎస్‌ఏ హిందీ 12 10 22
ఎస్‌ఏ ఇంగ్లీష్ 100 5 105
ఎస్‌ఏ మ్యాథ్స్ 28 5 33
ఎస్‌ఏ ఫిజిక్స్ 28 1 29
ఎస్‌ఏ బయాలజి 58 10 68
ఎస్‌ఏ సోషల్ 120 12 132
ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 86 1 87
స్కూల్ అసిస్టెంట్ (ఇతర) 45 22 47
------------------------------------------------------------------------------------------------------
మొత్తం 1297 176 1473
------------------------------------------------------------------------------------------------------
విడుదలైన టెట్ ఫలితాలు
ఇటీవల నిర్వహించిన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) ఫలితాలను రాష్ట్రప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. జిల్లాలో అక్టోబరు 3న ప్రారంభమైన టెట్ పరీక్షలు అక్టోబరు 21న ముగిశాయి. జిల్లాలోని నాలుగు కేంద్రాలతో పాటు చెన్నైలోని రెండు కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాలకు చెందిన 6876 మంది పరీక్షలు రాశారు. ఇందులో 5893 మంది అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో, 983 మంది అభ్యర్థులు చెన్నైలోని రెండు కేంద్రాల్లో పరీక్షలు రాశారు. తుది కీ ఇటీవలే విడుదలైంది. టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1473 పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షలు 2025 ఫిబ్రవరిలో నిర్వహించే వీలుంది. టీచర్ ఖాళీల భర్తీతో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - Nov 05 , 2024 | 01:11 AM