వేటగాళ్ల చేతిలో చిరుత హతం
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:58 AM
వేటగాళ్ల చేతిలో ఓ చిరుత హతమైంది. యాదమరి మండలం బోడబండ్ల ఫారెస్టు బీట్‌లో నాలుగైదురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.
- బోడబండ్ల ఫారెస్టు బీట్‌లో ఘటన
యాదమరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వేటగాళ్ల చేతిలో ఓ చిరుత హతమైంది. యాదమరి మండలం బోడబండ్ల ఫారెస్టు బీట్‌లో నాలుగైదురోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. డీఎఫ్‌వో భరణి కథనం మేరకు.... తాళ్ళమడుగు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడం గమనించి అటవీశాఖ అధికారులకు పశువుల కాపర్లు సమాచారం అందించారు. డీఎ్‌ఫవోతో పాటు ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ఈశ్వర్, అటవీశాఖ సిబ్బందితో కలసి వెళ్లి పరిశీలించగా ఐదేళ్ళ మగ చిరుత కళేబరం కన్పించింది.నాలుగైదు రోజుల క్రితమే ఆ చిరుత మరణించి వుంటుందని అంచనాకొచ్చారు.చిరుత కాళ్లు, దంతాలు లేకపోవడంతో వాటికోసం వేటగాళ్లు హతమార్చి వుంటారని భావిస్తున్నారు.చిరుతకు తలపైన బలమైన గాయమైవుండడం, కాలులోని ఎముక, ఛాతీలోని పక్కటెముకలు విరిగిపోయి వుండడం చూసి ఉచ్చులో పడిన చిరుతను వేటగాళ్లు కొట్టి చంపారన్న అంచనాకు వచ్చారు. తిరుపతి ఎస్వీ జూ వెటర్నరీ వైద్యుడు డాక్టర్ అరుణ్ చిరుతకు పోస్టుమార్టం నిర్వహించాక అక్కడే దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో భరణి మాట్లాడుతూ చిరుతపులి మరణానికి గల కారణాలను పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడక్కడా వన్యప్రాణులను వేటాడేందుకు బిగించిన ఉచ్చులను, పంటపొలాలకు అమర్చిన విద్యుత్ తీగలను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా యాదమరి మండలంలోనే మూడేళ్ల క్రితం ఓ చిరుతను హతమార్చిన కేసులో నలుగురికి శిక్ష పడిన విషయం తెలిసిందే.
Updated Date - Oct 22 , 2024 | 01:58 AM