నోట్ దిస్ పాయింట్ జగన్..
ABN, Publish Date - Sep 29 , 2024 | 02:52 AM
శ్రీవారి లడ్డూ వివాద నేపథ్యంలో తిరుమల పర్యటనకు సిద్ధపడి, రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పోలీసులు నోటీసులివ్వడంపై రాద్ధాంతం చేశారు.
వైసీపీ కన్నా కూటమి పార్టీల శ్రేణులకే ఎక్కువ నోటీసులుతమవాళ్లకే నోటీసులిచ్చి అడ్డుకున్నారంటూ అబద్దాలెందుకు
తిరుపతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ వివాద నేపథ్యంలో తిరుమల పర్యటనకు సిద్ధపడి, రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పోలీసులు నోటీసులివ్వడంపై రాద్ధాంతం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని, దేవుడి దగ్గరకు వెళ్లాలనుకుంటే అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని తమ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చి అడ్డుకున్నారని, ఉల్లంఘించి బయటకివస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని జగన్ చెప్పడాన్ని కూటమి నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేలాదిమంది తమ నాయకులకు నోటీసులిచ్చారని శనివారం గంగమ్మ గుడిలో మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి అదే మాటను వల్లెవేశారు. తిరుపతి జిల్లాలో 218మంది వైసీపీ శ్రేణులకు పోలీస్ శాఖ నోటీసులివ్వగా 292 మంది కూటమి నేతలు కూడా నోటీసులందుకున్నారు. వీరిలో 154 మంది టీడీపీ నాయకులు, 138 మంది జనసేన నాయకులు ఉన్నారు. తిరుమలకు వచ్చిన తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలతకు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఇవేమీ తెలియనట్టుగా తమ పార్టీ వాళ్లనే పోలీసులు నిర్బంధించారని చెప్పడం సిగ్గుచేటని కూటమి పార్టీల నేతలు మండిపడుతున్నారు.
అప్పటి హౌస్ అరెస్టులు మరిచారా?
వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ మూల చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా తిరుపతిలోని కూటమి పార్టీల నాయకులంతా గృహ నిర్బంధాలకు గురయ్యేవారు. తిరుపతి టౌన్‌బ్యాంకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా అరెస్టు చేయించిన ఘనత వైసీపీదే.తిరుపతికి జగన్ వచ్చే ప్రతి పర్యటనలోనూ కూటమి నేతల ఇంటి ముందు పోలీసులు నోటీసులతో ఉండేవాళ్లు. జగన్ తిరుగు ప్రయాణం అయ్యే వరకు అడుగు బయటపెట్టనిచ్చేవారు కాదు. టీడీపీ అధిష్ఠానం ఏదైనా నిరసనకు పిలుపునిచ్చినా వైసీపీ నేతల ఆదేశాలతో పోలీసులు కూటమి నేతల ఇంటి ముందు వాలిపోయేవారు. ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడేదో రాక్షస రాజ్యం నడుస్తోందని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా వుందని కూటమి పార్టీల నేతలంటున్నారు.
ఇప్పుడు కూటమి నేతలైనా...
శాప్ ఛైర్మన్‌గా ఎన్నికైన రవినాయుడు శుక్రవారం తిరుపతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలుగు యువత నేతలు పెద్దయెత్తున స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన తన పర్యటనను శనివారానికి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా టీటీడీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అనారోగ్యంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో మూడు రోజులుగా అడ్మిషన్‌లో ఉన్నారు. పోలీసులు ఆయన ఇంటికి వచ్చి ఆస్పత్రిలో ఉన్నట్టు ఫొటో, లొకేషన్ తెప్పించుకున్న తర్వాతే అక్కడి నుంచి కదిలారు. అదే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను ఇలా స్వేచ్ఛగా విధులు నిర్వహించుకోనిచ్చి ఉంటారా? అన్న ప్రశ్న కూటమి నేతల్లో ఉత్పన్నమవుతోంది.
Updated Date - Sep 29 , 2024 | 08:16 AM