సంఘ విద్రోహ శక్తులపై పీడీ యాక్టు
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:50 AM
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహశక్తులపై పీడీ యాక్టు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ హెచ్చరించారు.
ఫ శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక
ఫ ఇకపై ఇలాంటివి జరగకుండా బాధ్యత తీసుకుంటామన్న సభ్యులు
వి.కోట, సెప్టెంబరు 4: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహశక్తులపై పీడీ యాక్టు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. వి.కోటలో బుధవారం హిందూ, ముస్లిం పెద్దలతో ఏర్పాటైన శాంతి కమిటీ సమావేశమైంది. రెండు మతాలకు చెందిన కొందరు సొంత ప్రయోజనాల కోసం ప్రేరేపించడం వల్ల అల్లర్లు జరిగినట్లు సభ్యులందరూ ఏకీభవించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఘర్షణలకు కారకులైన ఆరీఫ్, అతడి కుటుంబ సభ్యులు.. రామచంద్ర ప్రవర్తనను సభ్యులు ఖండించారు. ఆరీఫ్ కుటుంబీకులు తమ ప్రవర్తన మార్చుకోకుంటే మసీదుల నుంచి బహిష్కరించమని కలెక్టర్ కోరారు. రామచంద్ర విషపూరిత మాటలు హిందూ యువకులు వినకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. వీరు హిందూ, ముస్లింల ఐక్యతకు, మత స్వేచ్ఛకు మచ్చ తీసుకొస్తున్నారని ప్రజలు గుర్తించాలన్నారు. సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి వి.కోట సర్పంచి, ఆమె కుమారుడు పీఎన్ నాగరాజ్ అండగా ఉన్నారని గుర్తించామని సభ్యులు చెప్పారు. దీంతో సర్పంచ్ చెక్ పవర్‌ను తొలగిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఘర్షణలో ఆస్తి నష్టం జరిగిన వారికి త్వరగా నష్ట సరిహారం అందేలా చూస్తామన్నారు. వినాయక చవితి వేడుకలు యథావిధిగా జరుగుతాయని, హిందూ, ముస్లింలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎస్పీ సూచించారు. ఆరు నెలలపాటు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
22 మందితో శాంతి కమిటీ
హిందూ, ముస్లిం పెద్దలు 22 మందితో శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు తహసీల్దారు పార్వతి తెలిపారు. జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్రనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు రంగనాథ్, వైసీపీ కన్వీనర్ బాలగురునాథ్, మాజీ సర్పంచి సుబ్రమణ్యం, నియోజక వర్గ బీజేపీ అధ్యక్షుడు విజయ్, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సీతారామయ్య, దుర్గామాత కమిటీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, సుప్రభాత్ సీఈవో ఉదయసాగర్‌రెడ్డి, ఆయిమాతా ఆలయ కార్యదర్శి లాబూరాం, రాగశ్రీ పాఠశాల కరస్పాండెంట్ రఘుపతి ఉన్నారు.
ఫ మరో వర్గం నుంచి మైనారిటీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇక్భాల్, మండల అధ్యక్షుడు రుహుల్లా, జామియా మసీదు ముత్తువలి అబ్దుల్ సలాంసాహెబ్, చౌక్ మసీద్ ముత్తువలీ మహమ్మద్ బాషా, ఖాజీపేట ముత్తువలి లతీఫ్, అడ్వకేట్ నవాజ్, వైస్ సర్పంచ్ అక్మల్‌బాషా, జహీర్ మౌలానా, హెసానుల్లా, అఖీల్ అహమ్మద్, జాకీర్, గౌస్‌పీర్ ఉన్నారు.
అఖిలపక్షం సంఘీభావ ర్యాలీ
ఎంపీడీవో కార్యాలయం నుంచి లాంగ్ బజారు మీదుగా అఖిలపక్షం నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అన్నదముల్లా కలసి మెలసి ఉన్న వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఘర్షణలకు, దాడులకు తెగబడటం సరికాదన్నారు. హిందూ, ముస్లిం బాయీ బాయి అంటూ నినదించారు.
144 సెక్షన్ సడలింపు
రెండో రోజైన బుధవారం వి.కోటలో 144 సెక్షన్‌ను పాక్షికంగా సడలించామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. కూరగాయలు, పూలు, పండ్ల దుకాణాలతో పాటు ఇతర చిరు దుకాణాల నిర్వహణకు అనుమతిచామన్నారు. పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయన్నారు. మరికొన్ని దుకాణాలకు, హోటళ్లకు గురువారం అనుమతి ఇస్తామన్నారు. అన్ని చోట్ల సాక్ష్యాలు సేకరిస్తున్నామని, పూర్తి స్థాయిలో విచారించాక బాధ్యతలపై చర్యలు ఉంటాయని ఎస్పీ మణికంఠ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై గ్రామ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. కాగా, బుధవారం కూడా పోలీసు బందోబస్తు కొనసాగింది.
Updated Date - Sep 05 , 2024 | 01:50 AM