కాణిపాకం ఈవో నియామకంపై పునరాలోచన?
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:24 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆలయ ఈవోగా పనిచేస్తున్న గురుప్రసాద్ ఆగస్టు 31న ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ముందు ఎఫ్‌ఏసీగా వాణి పనిచేశారు. ఆమెకు ముందు ఆలయ ఈవోగా వెంకటేశు బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఆలయంలో జరిగిన అనేక పరిణామాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ తరుణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరసిద్ధుడి ఆలయంపై దృష్టి సారించారు. ఈవో వెంకటేశును మాతృశాఖ అయిన రెవెన్యూకు బదిలీ చేస్తూ.. జీడీఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గురుప్రసాద్ ఈవోగా బాధ్యతులు తీసుకున్న వెంటనే ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. హఠాత్తుగా ఈయనను బదిలీ చేసి.. ఈవోగా పెంచల కిషోర్‌ను నియమించారు. మూడు నెలల్లోనే ముగ్గురు ఈవోలను బదిలీ చేయడం కాణిపాకంలో చర్చనీయాంశంగా మారింది. ఈవోగా పెంచల కిషోర్‌ను నియమించడంపై కాణిపాకం టీడీపీ నాయకులు ముఖ్యమంత్రికి లేఖలు రాసినట్లు సమాచారం. డిప్యూటీ కలెక్టర్ పెంచలకిషోర్.. వైసీపీ వారికి అనుకూలంగా గతంలో వ్యవహరించారని వారు పేర్కొన్నారు. ఈ అంశాలను మంత్రులు లోకేష్, ఆనం నారాయణరెడ్డి దృష్టికి కొందరు నాయకులు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కాణిపాక ఆలయ ఈవో బదిలీపై పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.
Updated Date - Dec 03 , 2024 | 02:24 AM