వైసీపీ నేత మిల్లులో పేదల బియ్యం!
ABN, Publish Date - Dec 18 , 2024 | 01:18 AM
పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్
కుప్పం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయినా వైసీపీ నేతల ఆగడాలు ఆగడంలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనే రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. టన్నులకొద్దీ రేషన్ బియ్యాన్ని సొంత మిల్లులకు చేర్చి, పాలిష్ చేసి మరీ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ బైరుగానిపల్లెవద్ద వున్న వైసీపీ నేత రైస్ మిల్లుపై మంగళవారం సాయంత్రం రెవెన్యూ, పోలీస్ అధికారులు జరిపిన దాడుల్లో ఏకంగా 2.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడమే దీనికి నిదర్శనం. పలమనేరు నియోజకవర్గం వి.కోటకు చెందిన వైసీపీ నాయకుడు ఆండియప్పన్ బైరుగానిపల్లె వద్ద రైస్ మిల్లు నడుపుతున్నారు. ఇక్కడ అసలు వ్యాపారంకంటే రేషన్ బియ్యం పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేసే దందా ఎక్కువగా నడుస్తున్నదని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దందా విచ్చలవిడిగా సాగుతుండగా ఒకటిరెండు సార్లు ఆండియప్ప రైస్‌మిల్లులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతూ పట్టుబడింది కానీ, అధికారులు చర్యలు తీసుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ రైస్ మిల్లులో ఇదే దందా సాగుతున్నదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ రేషన్ బియ్యం పాలిష్ చేసి, ఆనవాలు తెలియకుండా ఏదో ఒక బ్రాండ్ వేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది.తహసిల్దారు చిట్టిబాబు, సీఐ మల్లేశ్ యాదవ్, ఆర్‌ఐ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం సిబ్బందితో కలిసి ఆండియప్పన్ రైస్ మిల్లుపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5,420 కిలోల రేషన్ బియ్యం పట్టుబడింది. ఇందులో సుమారు 750 కిలోల బియ్యాన్ని అప్పటికే పాలిష్ చేసి బ్యాగుల్లో ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉంచారు. మిగిలిన రేషన్ బియ్యం అలాగే మూటల్లో ఉంది. మిల్లు యజమాని లేరు కానీ, మిషన్ ఆపరేటర్ బాలాజీ పట్టుబడ్డాడు. రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు ఆపరేటర్ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తహసిల్దార్ చిట్టిబాబు, సీఐ మల్లేశ్ యాదవ్, ఆర్ ఐ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆండియప్పన్ రైస్ మిల్లులో 5420 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడిందని చెప్పారు. బియ్యం సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.
Updated Date - Dec 18 , 2024 | 01:18 AM