గురువులకు వందనం
ABN, Publish Date - Sep 05 , 2024 | 01:39 AM
‘‘నేను చదువుకునేటప్పుడు కథలు చెప్పి నీతి అడిగేవారు. తప్పు, ఒప్పుల గురించి వివరించేవారు. ఇప్పుడు చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. విలువలు తెలియడం లేదు. అందుకే 14 ఏళ్ల పిల్లలు ఇంట్లో నుంచి ప్రేమ పేరుతో వెళ్లిపోతున్నారు.
- చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు
‘‘నేను చదువుకునేటప్పుడు కథలు చెప్పి నీతి అడిగేవారు. తప్పు, ఒప్పుల గురించి వివరించేవారు. ఇప్పుడు చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. విలువలు తెలియడం లేదు. అందుకే 14 ఏళ్ల పిల్లలు ఇంట్లో నుంచి ప్రేమ పేరుతో వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రుల మీదా తిరగబడుతున్నారు. ఇప్పడు టీచర్ల మీదే ఎక్కువ బాధ్యత ఉంది.’’
చిత్తూరు, ఆంధ్రజ్యోతి
చిన్ననాట గురువులు విద్యార్థుల ఆలోచనల్లో నాటిన విత్తనం.. చదువులోనే కాదు వ్యక్తి వికాసంలోనూ కీలకంగా మారుతుంది. అందుకే ఏ స్థాయికి ఎదిగినా గురువులను తలచుకుంటారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తనకు దారి చూపిన గురువులను ఇలా గుర్తు చేసుకుంటూ నమస్కరించుకుంటున్నారు.
ఏ స్థాయికి ఎదిగినా చిన్ననాటి నుంచీ గురువులు
ప్రతి విద్యార్థి జీవితంలోనూ గురువులు ఉంటారు. వారిలో కొందరే మన మీద ముద్ర వేస్తారు. ఆదర్శంగా నిలుస్తారు. మనం ఎదిగేందుకు కారణమవుతారు. గురువులంటే స్కూల్‌లో, కాలేజీలో చదువు చెప్పినవారే కాకుండా బయట కూడా చాలామంది మనల్ని ప్రభావితం చేస్తారు. మనకు అండగా నిలిచి మన ఉన్నతికి కారణమవుతారు. వారు కూడా గురువులే. జీవితంలో తొలి గురువులు తల్లిదండ్రులే. గురుపూజోత్సవం సందర్భంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు.. తన జీవితంలో కీలక పాత్ర పోషించిన, ఆదర్శంగా నిలిచిన గురువుల గురించి ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా పంచుకున్నారు.
తొలి గురువులు అమ్మా నాన్నా
మా అమ్మ శారదాదేవి నాలుగో తరగతి, నాన్న మంగాచారి ఆరో తరగతి వరకే చదువుకున్నారు. వారిద్దరూ చదువుకోకపోయినా ప్రతి రోజూ నన్ను చదువుకోమని చెప్పేవారు. వారే నాకు తొలి గురువులు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంసెట్‌కు దరఖాస్తు చేసేందుకు డబ్బుల్లేవు. అప్పుడు మా అమ్మ ఇంట్లోని గిన్నెలు అమ్మేసి డబ్బులు ఇచ్చింది. మిషన్ కుట్టి నా చదువుకు అమ్మ డబ్బులిచ్చేది. ఇప్పటికీ మా ఇంట్లో అమ్మ వద్ద కుట్టు మిషన్ అలాగే ఉంది.
స్కూల్‌లో తెలుగు టీచర్
మార్టూరులోని రాయల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పది వరకు తెలుగు చెప్పిన టీచర్ భవానీ మేడమ్ అంటే నాకు చాలా గౌరవం. ఆమె ప్రతిభ, పిల్లల్ని అర్థం చేసుకోవడం నాకు నచ్చుతాయి. స్కూల్లో పిల్లలకు పాఠాలు అర్థం కాకుంటే మళ్లీ స్టడీ అవర్ నిర్వహించి పాఠాలు చెప్పేవారు.
ఇంటర్‌లో రామకృష్ణ సార్
నాకు ఎప్పటికీ గుర్తుండే టీచర్ రామకృష్ణ సార్. ప్రస్తుత బాపట్ల జిల్లా మార్టూరులోని రాయల్ జూనియర్ కాలేజీలో ఆయన నాకు ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్ టీచర్. ఆయన వేసిన ఇంప్రెషన్ నాలో ఇప్పటికీ ఉంది. ఆయన బోధించే విధానం చాలా బావుంటుంది. విద్యార్థి స్థాయి కనుక్కుని, వారికి అర్థమయ్యేలా బోధించేవారు రామకృష్ణ సార్. టాప్‌లో కొంతమంది, బాటమ్‌లో మరికొంతమంది విద్యార్థులుంటారు. వారిని విభజించి చదువు చెప్పాలి. రామకృష్ణ సార్ అక్కడే చదువు చెప్పారు.
మోటివేట్ చేసిన శ్రీధర్‌బాబు
చిన్న ఉద్యోగం చేసుకుటూ చదువుకునేవాడిని. ఓ రోజు లైబ్రరీలో అద్దంకి శ్రీధర్‌బాబు గారి ఇంటర్వ్యూ చదివాను. బాగా మోటివేట్ అయ్యాను. నాలో కాన్ఫిడెన్స్ పెరిగి ఒక్కో పరీక్ష దాటుకుంటూ వచ్చాను. ఉత్తరాఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన శ్రీధర్‌బాబు ప్రస్తుత గుంటూరు టొబాకో బోర్డు డైరెక్టరుగా ఉన్నారు. నా మనసులో ఆయనది గురు స్థానమే.
ట్రైనింగ్‌లో వంశీప్రియ అక్క
హైదరాబాదులో నేను ఫారెస్టు రేంజ్ ఆఫీసర్‌గా ఎంపికై ట్రైనింగ్ అయ్యేటప్పుడు నా బ్యాచ్‌మేట్ వంశీప్రియ నాకు అక్కలా ఉండేది. మంచీ చెడ్డా చెబుతూ ఎప్పటికప్పుడు నన్ను మోటివేట్ చేసేది. ఆమె నాకు గురువులాంటిదే.
Updated Date - Sep 05 , 2024 | 01:39 AM