బాలింతలకు ప్రత్యేక గది
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:16 AM
బాలింతలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు.
తిరుపతి(వైద్యం), నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రుయా చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల కోసం ఆస్పత్రిలో ఉంటున్న బాలింతలకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు. చికిత్స పొందుతున్న ‘చంటి బిడ్డల కోసం’ వార్డుల ముందు అవస్థలు పడుతున్న బాలింతల విషయంపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఏపీఎంఐసీడీసీ అధికారులతో కలిసి మంగళవారం బాలింతలు ఉంటున్న ఆవరణాన్ని పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తల్లుల కోసం ఏర్పాటు చేసిన రెండు విశాలమైన గదులను కొవిడ్ తర్వాత వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నామన్నారు. తిరిగి వాటిని తల్లులు ఉండేందుకు అనుకూలంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతానికి అందులో ఒక గదిని సిద్ధం చేశామన్నారు. వారంలో మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం బాలింతలు ఉంటున్న వరండాల్లో దోమల బెడద, ఉక్కపోతల సమస్యలు లేకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Updated Date - Nov 13 , 2024 | 12:16 AM