వర్కింగ్ చైర్మన్ హోదాతో నా పేరు లేకుండా శిలాఫలకమా!
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:45 AM
‘వర్కింగ్ చైర్మన్ హోదాతో నా పేరు లేకుండా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తారా? వెంటనే దానిని తొలగించి.. నా పేరుతో ఏర్పాటు చేయండి’ అంటూ రుయాస్పత్రి హెచ్‌డీఎ్‌స (హాస్పిటల్ డెవల్‌పమెంట్ సొసైటీ) సభ్యుడు బండ్ల చలపతి బుధవారం వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫ రుయాలో హెచ్‌డీఎ్‌స సభ్యుడి వీరంగం
ఫ వైద్యుల వ్యక్తిగత కార్యక్రమమని చెప్పినా వినిపించుకోని వైనం
ఫ చివరకు శిలాఫలకం తొలగింపు
‘వర్కింగ్ చైర్మన్ హోదాతో నా పేరు లేకుండా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తారా? వెంటనే దానిని తొలగించి.. నా పేరుతో ఏర్పాటు చేయండి’ అంటూ రుయాస్పత్రి హెచ్‌డీఎ్‌స (హాస్పిటల్ డెవల్‌పమెంట్ సొసైటీ) సభ్యుడు బండ్ల చలపతి బుధవారం వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రుయాలోని చిన్న పిల్లల వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 1967 నుంచి 1983 వరకు ఎస్వీ వైద్య కళాశాల బోధనాస్పత్రి అయిన రుయాస్పత్రిలో డాక్టర్ కె.ఇందిరా బాయ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రి కోసం ఎంతో కృషి చేసి ప్రత్యేకంగా చిన్నపిల్లల విభాగాన్ని తీసుకొచ్చారు. దీంతోపాటు అదనంగా పీజీ, ఎండీ సీట్లు వచ్చేందుకూ ఎంతో కృషి చేశారు. డాక్టర్ బీసీ రాయ్ వంటి ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇప్పటికీ చిన్నపిల్లల విభాగంలో ఈమె చిత్రపటం భారీ స్థాయిలో కనిపిస్తుంది. అలాగే అప్పటి విద్యార్థులకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె వద్ద వైద్య విద్య నేర్చుకున్న 1977 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు (ప్రస్తుత డాక్టర్లు) చిన్నపిల్లల విభాగం ముందు ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు అధికారుల అనుమతితో విగ్రహం ఏర్పాటు చేశారు. దీనికింద ప్రత్యేక అతిథులతోపాటు, నిర్వాహకుల పేర్లతో మంగళవారం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 31న విగ్రహ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హెచ్‌డీఎ్‌స సభ్యుడి వీరంగం
విగ్రహం ఏర్పాటు విషయం తెలుసుకున్న హెచ్‌డీఎ్‌స సభ్యుడు బండ్ల లక్ష్మీపతి బుధవారం చిన్నపిల్లల విభాగానికి చేరుకొన్నారు. పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ హోదాతో తన పేరు ఎందుకు రాయించలేదని అక్కడ వైద్యులను ప్రశ్నించారు. ఇది పూర్వ వైద్య విద్యార్థుల వ్యక్తిగత కార్యక్రమమని చెప్పడంతో.. వారిపై ఆగ్రహించారు. ‘ఇదేమైనా మీ సొంతిల్లు అనుకుంటున్నారా? ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదు. వెంటనే శిలాఫలకాన్ని తొలగించి, వర్కింగ్ చైర్మన్ హోదాతో నా పేరు రాసి ఏర్పాటు చేయండి. లేకపోతే విగ్రహం కూడా తొలగించండి’ అంటూ హెచ్చరించారు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళతామని వైద్యులు ఆయనకు చెప్పగా.. ఆస్పత్రికి వర్కింగ్ చైర్మన్‌ను తాను అని, తాను చెప్పింది చేయాలని ఆర్డరు వేశారు. తన పక్కనున్న వ్యక్తిగత మనుషులతో ఆస్పత్రిలో సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందిని పిలిపించి ఆ శిలాఫలకాన్ని తొలగించేశారు. తిరిగి శిలాఫలకం ఏర్పాటు చేయాలంటే వర్కింగ్ చైర్మన్ హోదాతో తన పేరు రాయాలని స్పష్టంచేశారు.
ఇప్పుడే ఇలాగా...
ఎస్వీ వైద్య కళాశాలలో, రుయాస్పత్రిలో పూర్వపు విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తుంటారు. ఇందులో ఇంత వరకు ఎప్పుడూ రాజకీయ నేతల జోక్యం ఉండేది కాదు. ఇప్పుడే తమ కార్యక్రమాలను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైద్యాధికారులు అంటున్నారు. ఇలాగైతే ఇప్పటిలా అభివృద్ధి కార్యక్రమాలకు పూర్వపు విద్యార్థులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్కింగ్ కమిటీ చైర్మన్ హోదానే లేదు
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ హోదానే లేదని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. వర్కింగ్ చైర్మన్ పేరుతో కమిటీ సభ్యుడు బండ్ల లక్ష్మీపతి చెలామణి అవుతుండటంపై ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆయన పైవిధంగా చెప్పారు. చైర్మన్ హోదాలో కలెక్టరు, కో చైర్మన్ హోదాలో స్థానిక ఎమ్మెల్యే మాత్రమే ఉంటారని, మిగిలిన వారంతా సభ్యులేనని తేల్చిచెప్పారు. వర్కింగ్ చైర్మన్ అని కమిటీ సభ్యుడు చెప్పుకుంటున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు. అలా చెప్పరాదని ఇప్పటికే చెప్పామని, మరోసారి పరిశీలించి తగు చర్యలు చేపడతామన్నారు. వర్కింగ్ చైర్మన్ హోదాతో ఆస్పత్రి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని సూచించామన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 01:45 AM