భూదేవి కాంప్లెక్సులో సిట్ కార్యాలయం
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:18 AM
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై విచారణ కోసం నియమించిన సీబీఐ సిట్ కోసం టీటీడీ భూదేవి కాంప్లెక్సులోని పాత ఎస్వీబీసీ కార్యాలయం కేటాయించారు.
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 16(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై విచారణ కోసం నియమించిన సీబీఐ సిట్ కోసం టీటీడీ భూదేవి కాంప్లెక్సులోని పాత ఎస్వీబీసీ కార్యాలయం కేటాయించారు. ఇక్కడ సిట్ అధికారులకు అవసరమైన కంప్యూటర్ గదులు, విచారణకు అవసరమైన ప్రత్యేక వసతులు, డీఎస్పీలు, సీఐలకు, అధికారులు వేచి ఉండేందుకు అన్ని రకాల వసతులు ఉండటంతో దీనిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టీటీడీకి ప్రత్యేక లేఖ రాయడంతో పాత ఎస్వీబీసీ కార్యాలయాన్ని కేటాయించడానికి అధికారికంగా అంగీకరించారు. ఈ విషయాన్ని సిట్ బృందంలోని ఓ అధికారి శనివారం రాత్రి ధ్రువీకరించారు. విచారణకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతరత్రా పరికరాలను సమకూర్చనున్నారు. సిట్‌లో ఇద్దరు సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ నుంచి మరో ఇద్దరు అధికారులు, ఆహార కల్తీ నిరోధక శాఖ నిపుణుడు ఉంటారు. వీరికి సహాయంగా నలుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలతో పాటు మరికొందరు సిబ్బంది ఉంటారు. వీరందరూ కలసి దాదాపు 30 నుంచి 35 మంది ఉంటారని ఓ అధికారి తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వీలైనంత త్వరలో అన్ని ఏర్పాట్లతో కార్యాలయం ప్రారంభించడానికి పోలీసు అధికారులు, టీటీడీ చర్యలు చేపట్టింది.
Updated Date - Nov 17 , 2024 | 02:18 AM