టీటీడీ ఇంజనీరింగ్ ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ నోటీసులు!
ABN, Publish Date - Aug 11 , 2024 | 01:47 AM
వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి నిధులు కేటాయించారంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే పలువురు అధికారులు, ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా, అవసరానికి మించి నిధులు కేటాయించారంటూ టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే పలువురు అధికారులు, ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ లబ్ధికోసం గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇంజనీరింగ్ పనులకు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని, అవసరం లేకున్నా రోడ్లు వేశారని, కమీషన్ల కోసం శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రత్యేకంగా స్టేట్ విజిలెన్స్ బృందాలను తిరుపతికి పంపింది. వారు సుమారు రెండు నెలలపాటు ఇంజనీరింగ్ విభాగం మాత్రమే కాకుండా పలు కీలకమైన విభాగాల్లోనూ సోదాలు చేశారు. ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురు అధికారులు, ఉద్యోగులను విచారించారు. వారి వద్దనుంచి స్టేట్‌మెంట్లు కూడా రికార్డు చేశారు. స్వయంగా అన్నింటినీ పరిశీలించారు. ఈక్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన, చేస్తున్న దాదాపు 58 మంది అధికారులు, ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ బోర్డు తీర్మానాలను ఎందుకు వ్యతిరేకించలేదంటూ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. త్వరలో కొందరిపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే మిగిలిన విభాగాల అధికారులు, ఉద్యోగులకూ త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Updated Date - Aug 11 , 2024 | 07:32 AM