ప్రజా సమస్యల్ని తీర్చడమే ప్రధాన లక్ష్యం
ABN, Publish Date - Aug 11 , 2024 | 02:08 AM
సుమిత్ కుమార్.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస సమీక్షలు, తనిఖీలు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మీద ఓ అవగాహనకు వచ్చారు. ఇక్కడి అవసరాలు తెలుసుకున్నారు. వాటిని తీర్చేందుకు పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో ప్రాధాన్యాంశాలు.. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు.. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న చర్యలపై కలెక్టరు సుమిత్ కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకుంటాం
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించాలి
సీఎం జిల్లా కావడంతో మరింత బాధ్యత
‘ఆంధ్రజ్యోతి’తో కలెక్టర్ సుమిత్‌కుమార్
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: కుప్పం, పలమనేరు, నగరి ప్రాంతాలు పరిశ్రమల స్థాపనకు అనువైనవి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. నగరి ప్రాంతంలో 1500 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల వెళ్లి ఆ భూముల్ని పరిశీలించా. కుప్పంలో కూడా పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నాం. నగరి, కుప్పం ప్రాంతాల్లో మూడు నాలుగు నెలల్లోనే ప్రగతి కనిపించనుంది. ఇప్పటికే పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయి. అక్కడ మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చూస్తాం. జిల్లాకు మ్యానుఫాక్చరింగ్, ఆటో మొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఇండస్ట్రీలు జిల్లాకు అవసరమని గుర్తించాం. తదనుగుణంగా ఆయా పరిశ్రమల్ని తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.
నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు
సాధారణంగా ప్రజలు తమ సమస్యల్ని కింది స్థాయి అధికారులకంటే పైస్థాయి వారికి చెబితే త్వరగా పరిష్కారమవుతాయని భావిస్తారు. అందుకే కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ డే రోజు పెద్దఎత్తున అర్జీలు వస్తుంటాయి. ఇక నుంచి అలా కాదు. సామాన్య ప్రజలైనా సరే ఎవరి సిఫార్సు లేకుండానే ఏ సమయంలోనైనా నన్ను కలవచ్చు. సమస్యలు చెప్పుకోవచ్చు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చడమే నా మొదటి ప్రాధాన్యత.
కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకోవచ్చు
ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నా. ఆ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, పశువులకు షెడ్లు, శ్మశానాల అభివృద్ధి వంటి పనుల్ని చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. పీఎం ఎంప్లాయిమెంట్ గ్రామీణ్ ప్రోగ్రామ్, స్టాండప్ ఇండియా, ముద్ర ఇండియా వంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని కొత్తగా ఎంటర్‌ప్రైన్యూయర్స్‌ను ప్రోత్సహించవచ్చు. ఈ అంశంపై నెలకోసారి సమీక్షిస్తాను.
కొత్త సంస్థలకోసం ప్రణాళిక
జిల్లాకు ఎలాంటి కొత్త ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకుని రావచ్చని ఆలోచిస్తున్నాం. దానికి అనుగుణంగా ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వివిధ ఏర్పాటు దశల్లో ఉన్నాయి. చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. ఈ మధ్యే కేంద్ర బృందం స్థలాల్ని పరిశీలించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభం కానున్నాయి.
ఆ శాఖల్లో అవినీతి లేకుండా చేస్తా
ప్రజలతో నిత్యం పనులుండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీసు శాఖలతో పాటు ఉద్యోగులకు సంబంధమున్న ట్రెజరీలో కూడా అవినీతిని తగ్గించాలి. ఇదే ప్రధాన లక్ష్యంగా వచ్చిన రోజు నుంచీ పనిచేస్తున్నా. ఈ దిశగా పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నాం.
రైతులకు వీలైనంత ఎక్కువగా మేలు చేసేలా..
పశుసంవర్థక, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలు నా దృష్టిలో ముఖ్యమైనవి. ఈ మూడు సెక్టార్ల మీద నేను ఎక్కువ ఫోకస్ పెడతా. వీటిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పథకాల కింద నిధులు మనకు వచ్చేలా దృష్టిపెట్టి సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు వీలైనంత ఎక్కువ మేలు కలిగేలా చేస్తాను. గతంలో పనిచేసిన కలెక్టర్ రావత్ సార్ కూడా ఈ రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు.
నా మీద అదనపు బాధ్యత
ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలే నావి కూడా. మైక్రో ఇరిగేషన్, హార్టికల్చర్, హౌసింగ్, విద్య, వైద్యం, అంగన్వాడీ వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చి, రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నా. సీఎం సొంత జిల్లాలో పనిచేస్తున్న కాబట్టి నాపైన మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు అనుకూలంగా పనిచేసి వారి సమస్యల్ని పరిష్కరించాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరో 15 రోజుల్లో జిల్లాకు కొత్త అధికారుల బృందం సెట్ అవుతుంది. అప్పుడు సమష్టిగా పనిచేసుకుంటాం.
Updated Date - Aug 11 , 2024 | 02:08 AM