పూర్తికాని ‘నాడు-నేడు’ పనులు
ABN, Publish Date - Mar 22 , 2024 | 03:00 AM
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చేస్తాం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దుతాం. ఇలా గొప్పలు చొప్పుకున్న జగన్ సర్కార్.. రెండో విడత మనబడి నాడు-నేడు పనులు పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. మొదటి విడత పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 40 శాతం కూడా పూర్తికాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తొలుత ఇసుక సమస్య, ఆపై సిమెంట్ సరఫరాలో జాప్యం, ఫర్నిచర్ సకాలంలో అందించలేక పోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొదటి విడతలోనూ 57 పాఠశాలల్లో కొనసాగుతున్నాయి
చిత్తూరు సెంట్రల్, మార్చి 21: ఉమ్మడి చిత్తూరు జిల్లా (చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య)లో రెండో విడత కింద 2,322 పాఠశాలల్లో రూ.788.52 కోట్ల అంచనాతో 2021 ఆగస్టులో మనబడి నాడు-నేడు పనులు ప్రారంభించారు. 2022 డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసి, నూతన హంగులతో ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు అందుబాటులో తెస్తామని జగన్ ప్రభుత్వం డప్పు కొట్టింది. నిర్దేశించిన సమయానికి ప్రారంభించిన పనులు కనీసం 10 శాతం కూడా పూర్తి కాకపోవడంతో 2023 మే నెలాఖరులోపు, ఆపై సెప్టెంబరు నెలకు గడువును పొడిగించింది. అయినా 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చివరకు 2024 జనవరి వరకు గడువు పొడిగించినా.. 40 శాతం పనులు కూడా జరగలేదు. దీనికి నిధులు సకాలంలో విడుదల చేయక పోవడమే ప్రధాన కారణమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
ఖర్చు చేసింది 36 శాతమే..
రూ.788.25 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించినా, 2024 ఫిబ్రవరి నాటికి కేవలం రూ.280.62 కోట్లు (35.58 శాతం) మాత్రమే ఖర్చు చేశారు. చిత్తూరు జిల్లాలో 35 శాతం పనులు పూర్తవగా, 39 శాతం నిధులు ఖర్చు చేశారు. తిరుపతి జిల్లాలో 32.52 శాతం నిధులు ఖర్చు చేసినా, 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అన్నమయ్య జిల్లాలో 30.19 శాతం నిధులు ఖర్చు చేసి.. 20 శాతం పనులు పూర్తి చేశారు.
నిర్మాణాలు అసంపూర్ణం
నిర్మాణాలు అసంపూర్ణంగా ఉండటంతో పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిచోట్ల చెట్ల కింద, వరండాల్లో ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నారు.
రెండో విడత పనుల వివరాలిలా..
జిల్లా పేరు మొత్తం అంచనా ఇప్పటి వరకు
పాఠశాలలు వ్యయం అయిన ఖర్చు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
-----------------------------------------------------------------------------
చిత్తూరు 1210 424.10 165.75 (39 శాతం)
తిరుపతి 631 207.50 67.48 (32.52 శాతం)
అన్నమయ్య 478 156.92 47.38 (30.19 శాతం)
------------------------------------------------------------------------------
మొత్తం 2322 788.52 280.62 (35.58 ఽశాతం)
------------------------------------------------------------------------------
మొదటి విడతలో ఇలా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి విడతలో నాడు-నేడు కింద 1,533 పాఠశాలలు రూపురేఖలు మార్చేందుకు రూ.354 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ.320 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ విడతలో నాబార్డు నిధులతో 57 పాఠశాలల్లో చేపట్టిన పనులు ఇంకా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కార్వేటినగరం మండలంలో..
పాదిరికుప్పం, ఆర్‌కేబీవీ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రెండో విడతలో చేపట్టిన విద్యార్థుల తరగతి గదుల భవన నిర్మాణాలు మోల్డింగ్ వరకు జరిగాయి. నిధుల కొరత కారణంగా నిర్మాణాలు ఆగిపోయినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై ఇంజనీర్లను పలుమార్లు వివరణ కోరినా, సమాధానం చెప్పడం లేదు.
పెనుమూరు మండలంలో..
పెనుమూరు: మండలంలోని లక్కలపూడివాండ్ల ఊరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం కింద రెండో విడతలో సుమారు కోటి రూపాయల పనులు ప్రారంభించారు. సిమెంట్ కొరత, నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేసినట్లు తెలిపారు.
Updated Date - Mar 22 , 2024 | 03:00 AM