run away-పారిపోబోతూ శవమై తేలాడు
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:37 AM
పాలసముద్రం మండలం టీవీఎన్‌పురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ జగన్నాథరాజు కిడ్నాపర్లనుంచి పారిపోబోతూ చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.
ఫ ఎంపీటీసీ జగన్నాథరాజు మృతిపై పోలీసులు
ఫ గాయాలున్నాయి..కొట్టారంటున్న కుటుంబం
ఫ పోలీసుల అదుపులో 12మంది నిందితులు
గంగాధరనెల్లూరు/పాలసముద్రం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పాలసముద్రం మండలం టీవీఎన్‌పురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ జగన్నాథరాజు కిడ్నాపర్లనుంచి పారిపోబోతూ చనిపోయినట్లు పోలీసులు తేల్చారు.ఏలూరు జిల్లా నూజివీడు సీఐ రామకృష్ణ, ముసునూరు ఎస్‌ఐ చిరంజీవి కథనం మేరకు.. ఏడాది కిందట జగన్నాథరాజు నూజివీడుకు చెందిన నాగబాబు వద్ద ఫైనాన్స్‌లో పొక్లయినర్ తీసుకున్నారు. నెలవారీ కంతులు కట్టకపోవడంతో రెండు నెలల కిందట ముసునూరు పోలీ్‌సస్టేషన్‌లో నాగబాబు ఫిర్యాదు చేశారు. జగన్నాథరాజు పొక్లయినర్‌ను అమ్మేశారని నాగబాబుకు సమాచారం అందింది. ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో కూడా జగన్నాథరాజు ఇలాగే కంతులు కట్టలేదని సమాచారం. దీంతో వారంతా 12 మంది మాట్లాడుకుని సోమవారం చిత్తూరు జిల్లాకు చేరుకుని జీడీనెల్లూరులో జగన్నాథరాజును కిడ్నాప్ చేసి నూజివీడుకు తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ముసునూరు మండలం కాట్రేనుపాడు గ్రామ శివారులో బహిర్భూమికంటూ జగన్నాథరాజు వాహనం దిగారు. ఆయన వెంట ఒకరు వెళ్లినప్పటికీ తప్పించుకుని పారిపోయాడు. ఉదయం 5 గంటలకు అక్కడి పామాయిల్ తోటలో జగన్నాథరాజు పడివున్నాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వారంతా పోలీసులకు విషయం చెప్పారు. జగన్నాథరాజు భార్యకు కూడా సమాచారం అందించారు. మంగళవారం కిడ్నాప్ కేసు నమోదు చేసిన జీడీనెల్లూరు సీఐ లక్ష్మీనారాయణ నూజివీడుకు జగన్నాథరాజు కుటుంబీకులతో వెళ్లారు. అక్కడ నూజివీడు సీఐ రామకృష్ణతో కలిసి విచారణ చేశారు. బుధవారం జగన్నాథరాజు పోస్టుమార్టం పూర్తి చేశారు. రిపోర్టును వైద్యులు బుధవారం రాత్రికి కూడా ఇవ్వలేదు. జగన్నాథరాజు మృతి కేసులో 12మందిని ముసునూరు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. జీడీనెల్లూరు స్టేషనులో కేసు నమోదు కావడంతో ముసునూరులో కేసు పెట్టలేదు. కాగా.. నూజివీడు వెళ్లిన కుటుంబ సభ్యులు జగన్నాథరాజు మృతదేహాన్ని చూసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్నాథరాజు కుడి కంటి వద్ద గాయమై వుండడం, ముక్కులో, నోట్లో రక్తం ఉండడంతో తీవ్రంగా కొట్టినట్టు అనుమానముందంటున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో జగన్నాథరాజు మృతిపై మళ్లీ అనుమానాలు వస్తున్నాయి.
Updated Date - Oct 24 , 2024 | 01:37 AM