పోలీసుల అదుపులో మాధవరెడ్డి సన్నిహితులు!
ABN, Publish Date - Jul 28 , 2024 | 03:37 AM
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత ఘటనలో పోలీసులు జోరు పెంచారు.
రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగితో పాటు మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్
మిథున్‌రెడ్డి పీఆర్వోకు పిలుపు
మరికొందరి కోసం గాలింపు నేడో రేపో ఓ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఫైళ్ల దహనం కేసులో దూకుడు
రాయచోటి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత ఘటనలో పోలీసులు జోరు పెంచారు. ఐదు రోజుల పాటు ముమ్మరంగా విచారించిన పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి నిందితులు, అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు రైస్‌మిల్లు మాధవరెడ్డికి సన్నిహితులైన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఎంపీ మిథున్ రెడ్డి పీఆర్వోను విచారణకు పిలిపించారు. దీంతో గత ఐదేళ్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిఽథున్‌రెడ్డి అండ చూసుకుని పలు భూఆక్రమణలకు, దౌర్జన్యాలకు పాల్పడిన పలువురు వైసీపీ నాయకులు ఊర్లోదిలి తలో దిక్కుకు పారిపోతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీవోలు ఇచ్చిన సమాచారం మేరకు.. ఒకటి రెండు రోజుల్లో వైసీపీకి చెందిన ఓ తాజా మాజీ ఎమ్మెల్యేను విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు శనివారం తెల్లవారుజామున మాధవరెడ్డికి సన్నిహితుడైన మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గత ఐదేళ్లలో తాము చేసిన అక్రమాలు వెలుగులోకి రాకూడదనే పెద్దిరెడ్డి అనుచరులు ఫైళ్లను కాల్చేశారనే అనుమానాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారులు సైతం ఈ ఆరోపణలను దాదాపుగా ధ్రువీకరించారు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచ రుడైన మాధవరెడ్డిపైన పోలీసులు గురి పెట్టారు. ప్రస్తుతం మాధవరెడ్డి పరారీలో ఉండడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే జింకా వెంకటచలపతిని అదుపులోకి తీసుకున్నారు. తట్టివారిపల్లె బైపా్‌స రోడ్డులో నివాసం ఉంటున్న మిథున్‌రెడ్డి అనుచరుడు బాబ్జాన్ కోసం పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన అందుబాటులో లేనట్లు తెలిసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి పీఆర్‌వోగా పనిచేస్తున్న అక్కులప్పకు పోలీసులు ఫోన్ చేసి విచారణకు సహకరించాలని సూచించారు. డీఎస్పీ ఎదుట హాజరై విచారణకు తాను సహకరిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఆయన ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. పోలీసులు మొదట మదనపల్లె పట్టణం మిట్టపల్లెలో అక్కులప్ప తండ్రి నివాసం ఉంటున్న ఇంటిని సోదాలు చేశారు. అక్కులప్ప ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మాధవరెడ్డికి సన్నిహితంగా ఉండే రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి క్రిష్ణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
విచారణకు తాజా మాజీ ఎమ్మెల్యే?
మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో వైసీపీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేను కూడా ఒకటి రెండు రోజుల్లో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గ పరిధిలోని కొన్ని మండలాల్లో 22ఏ ఫైళ్లు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా, మరికొన్ని చాలా వేగంగా క్లియర్ అయినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్డీవో మురళిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మాజీ ఎమ్మెల్యే గురించి బయటపడినట్టు సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆర్డీవో హరిప్రసాద్ దగ్గర నుంచి కూడా పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతోనే పలువురు వైసీపీ నాయకులపై పోలీసులు ప్రతే ్యక నిఘా పెట్టినట్లు సమాచారం.
Updated Date - Jul 28 , 2024 | 08:50 AM