మద్యంపై కమాండ్ కంట్రోల్ సెంటర్
ABN, Publish Date - May 03 , 2024 | 04:05 AM
ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా పర్యవేక్షణకు విజయవాడలోని కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ పర్యవేక్షణ
అమరావతి, మే 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా పర్యవేక్షణకు విజయవాడలోని కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. మద్యం ఉత్పత్తి, రవాణా, సరఫరాను ఈ సెంటర్ నుంచి 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 37 డిస్టిలరీలు, 4 బ్రూవరీలు, 29 మద్యం డిపోల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల ఫుటేజీని నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం మద్యం రవా ణా చేసే వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని, ఎక్కడైనా వాహనాలు దారితప్పితే వాటిని సరిచేస్తున్నామని వివరించారు. అలాగే మద్యం నిల్వలు, అక్రమంగా మద్యం తయారీ, అమ్మకాల్లో ఉల్లంఘనలపై ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నామని తెలిపారు. 9154106528, 8121909444 నంబర్లకు ఫోన్‌చేసి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో జిల్లాకు ఒకటి చొప్పున సబ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
Updated Date - May 03 , 2024 | 07:41 AM