షర్మిలతో రాయ‘బేరం’!
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:52 AM
ఇన్నాళ్లూ సొంత చెల్లి షర్మిలను నానా రకాలుగా వేధించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు దిగొచ్చారు.
దిక్కు తోచక దిగొచ్చిన జగన్
బెంగళూరు వేదికగా చర్చలు
ఆస్తుల పంపకంపై రాజీ
దాదాపు కుదిరిన ఒప్పందం
ఆస్తుల పంపిణీకి ఎట్టకేలకు జగన్ ఓకే
కాంగ్రె్‌సతో దోస్తీ కోసం చెల్లెలితో రాజీ
ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఆ తర్వాతి పరిణామాలతో జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. దెబ్బకు వాస్తవంలోకి దిగొచ్చారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే నాలుగు మెట్లు దిగక తప్పదని గ్రహించారు. మరో దిక్కు కానరాక చెల్లి షర్మిలతో రాయ‘బేరానికి’ సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ ససేమిరా అంటూ వచ్చిన ఆస్తుల పంపిణీకి అంగీకరించారు. ఎందుకిలా? తెర వెనుక అసలు ఏం జరిగింది?
‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఇన్నాళ్లూ సొంత చెల్లి షర్మిలను నానా రకాలుగా వేధించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు దిగొచ్చారు. ఆమెతో రాయ‘బేరానికి’ దిగారు. ఆస్తిలో వాటాలు పంచేందుకు అంగీకరించారు. వాస్తవానికి తన ఆస్తిలో కుమార్తె షర్మిలకు సమాన వాటా ఉండాలని వైఎస్ రాజశేఖరరెడ్డి పలుమార్లు చెబుతుండేవారు. కానీ ఆయన మరణానంతరం ఆమెకు వాటా ఇచ్చేందుకు జగన్ ససేమిరా అన్నారు. అంతేకాకుండా ఆమెను పలు రకాలుగా వేధించారు. ఇంటి నుంచి దాదాపు వెలివేశారు. ఇది సరికాదని వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది చెప్పి చూసినా జగన్ ఖాతరు చేయలేదు. తండ్రి వైఎస్ ఇచ్చిన మాటను నెరవేర్చాలని ఆయనకు ఎంతగా నచ్చజెప్పినా.. ఆస్తుల పంపిణీకి ససేమిరా అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ కోసం తీవ్రంగా శ్రమించిన షర్మిల.. జగన్ అసలు స్వరూపం అర్థమయ్యాక పోరాటం తప్ప మరో మార్గం లేదని గ్రహించారు. తన హక్కుల కోసం ఆమె ఒకరకంగా భారీ ధర్మ యుద్ధమే చేశారు. అలుపెరుగని రీతిలో ఆమె చేసిన పోరాటం ఇప్పుడు ఫలితాలనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఏపీలో అడుగుతో..
షర్మిల రాజకీయ రంగ ప్రవేశాన్ని జగన్ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. ఆమె తెలంగాణకు పరిమితం కావడంతో తనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నట్లు ఉండిపోయారు. తన మొండి వైఖరిని కొనసాగించారు. కానీ మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఏకంగా రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టి జగన్‌పై పదునైన విమర్శలతో ఆమె కత్తి దూయడంతో జగన్‌కు దిమ్మతిరగడం మొదలైంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఊరూవాడా ఎలుగెత్తి చెబుతూ, జగన్ నిజ స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయగలిగారు. మరోవైపు చిన్నాన్న కుమార్తె సునీత విషయంలోనూ జగన్ అదే మొండి వైఖరితో వ్యవహరించి, బాబాయ్ హంతకులకే మద్దతిచ్చారు. దీంతో ఇద్దరు చెల్లెళ్లూ ఏకమయ్యారు. సొంత జిల్లాలో జగన్‌కు వ్యతిరేక పవనాలు ప్రారంభమవడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెప్పింది.
ఆ దెబ్బతో వణుకు..
ఎన్నికల వేళ ‘వైనాట్ 175’ అన్న ధీమాతో ఉన్న జగన్‌కు ఎవరు ఎన్ని హితోక్తులు చెప్పినా చెవికెక్కలేదు. సొంత చెల్లెళ్లకు అన్యాయం చేయడం సరికాదన్న మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా, తన కూలి మీడియాతో షర్మిలపై అసభ్యకరమైన దూషణలతో దాడి కూడా చేయించారు. తీరా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాతి పరిణామాలు జగన్‌కు వెన్నులో వణుకు పుట్టించాయి. ఓటమి తర్వాత సొంత పార్టీలోని కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా దూరమవడం ప్రారంభించారు. భజన బృందం తప్ప మిగతా తటస్థులూ, కాస్తో కూస్తో పద్ధతిగా ఉండేవారు వెళ్లిపోవడం మొదలెట్టారు. మరోవైపు జగన్ ఉస్కో అనగానే రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యవహరించిన వారిపై చంద్రబాబు సర్కారు చర్యలకు శ్రీకారం చుట్టింది. దాంతో జగన్ దాదాపు ఏకాకి అయిపోవడం మొదలైంది. ఈ పరిస్థితిలో పార్టీ మనుగడ సాగించాలన్నా, తనకు రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా ఏదో ఒక జాతీయ పార్టీ సహకారం అవసరమన్న వాస్తవం జగన్‌కు అవగతమైంది.
కేసుల భయం..
గడచిన ఐదేళ్లూ జగన్‌కు మద్దతిచ్చిన బీజేపీ.. ఎన్నికల వేళ ఆయన్ను వదలి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమి కట్టింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. దాంతో జగన్‌కు చుక్కలు కనిపించడం ఆరంభమైంది. మరోవైపు తన మీద ఉన్న కేసుల విషయంలో ఇన్నాళ్లూ కేంద్రంలోని ప్రభుత్వం అండతో ధిలాసాగా నెట్టుకొచ్చిన జగన్‌కు.. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొత్తంమీద రాష్ట్రంలో అధికారం పోయింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలోనూ వ్యతిరేక ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో పెద్దల అండా దూరమైంది. ఇక ఎవరూ కరుణించే పరిస్థితి లేదు. మిగిలింది.. కాంగ్రె్‌సతో కాళ్లబేరానికి వెళ్లడమే! కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి వాళ్లు జగన్ విషయంలో కొంత సాఫ్ట్‌గా ఉన్నారన్న వాదన ఉంది. కానీ ప్రధాన సమస్య షర్మిలే. ఇప్పుడు ఆమె చిన్నా చితకా నాయకురాలేమీ కాదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు. ఆమెతో ఘర్షణ కొనసాగిస్తే తనకు కాంగ్రెస్ వైపు చూసే చాన్స్ ఉండదని జగన్‌కు అర్థమైంది. కాంగ్రెస్ అండ లేకపోతే భవిష్యత్తు శూన్యమని ఆయన గ్రహించారు. దాంతో గత్యంతరం లేక చెల్లితో రాయబేరాలు నడపడం మొదలెట్టారు. గత కొద్దిరోజులుగా ఆయన తరచూ బెంగళూరు వెళ్లి, షర్మిలతో ఆస్తుల పంపకాలకు సంబంధించి మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, షర్మిల కోరిన విధంగా ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి జగన్ ఓకే అన్నారన్నది సమాచారం. ఈ విషయంలో జగన్ మాట నిలబెట్టుకుంటే ఆయనను కాంగ్రె్‌సకు దగ్గర చేయడానికి షర్మిల కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీని కాంగ్రె్‌సలో విలీనం చేస్తారన్న ప్రచారం కూడా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ పార్టీతో సయోధ్యకే జగన్ పరిమితమయ్యే అవకాశముంది.
Updated Date - Oct 21 , 2024 | 04:52 AM