జగన్‌పాలనలో రాష్ట్రాభివృద్ధి గుండు సున్నా..!
ABN, Publish Date - Apr 17 , 2024 | 03:08 AM
జగన్ పాలనలో రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని, రాష్ట్రాభివృద్ధి గుండా సున్నా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం కాంగ్రె్‌సకే వేయాలని ఆమె ప్రజలను కోరారు. ఏపీ న్యాయయాత్ర
ఆయన ఇచ్చిన హామీలకు ఎక్కడా దిక్కులేదు
సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఊసే లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా
ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి.. కాంగ్రె్‌సకే ఓటేయండి: షర్మిల
రాయచోటి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని, రాష్ట్రాభివృద్ధి గుండా సున్నా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం కాంగ్రె్‌సకే వేయాలని ఆమె ప్రజలను కోరారు. ఏపీ న్యాయయాత్ర పేరుతో మంగళవారం ఆమె అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలలో షర్మిల మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాలో రాష్ట్రమంతా పర్యటించిన జగన్మోహన్‌రెడ్డి అనేక హామీలిచ్చారని, అయితే అవేమీ ఎక్కడా అమలుకాలేదని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి.. ప్రత్యేక హోదా తెస్తామన్నారని, 23 మంది ఎంపీలను ఇచ్చినా.. ప్రత్యేక హోదా ఊసేలేకుండా చేశారని విమర్శించారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చి.. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించేదన్నారు. తాము అధికారంలోకొస్తే.. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. రాష్ట్రంలోని నిరుద్యోగులను జగన్ మోసం చేశారన్నారు. నాలుగున్నరేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి.. ఆరు నెలల ముందు నిద్రలేచి సిద్ధం అంటూ బయలు దేరారన్నారు. సిద్ధమా అని దేనికి అడుగుతున్నారో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు బీజేపీతో బహిరంగంగా పొత్తుపెట్టుకుంటే.. జగన్ రహస్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ప్రతి పేద మహిళకూ ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని, మహిళల పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదే తొలి సంతకం చేస్తామన్నారు. జగన్.. పండుగలాంటి వ్యవసాయాన్ని దండగ చేశారని, ఆయన పాలనలో అప్పులేని రైతు లేడని విమర్శించారు. వైఎస్ హయాంలో రేషన్ షాపుల్లో 11 రకాల వస్తువులు ఇచ్చేవాళ్లు, ఇప్పుడు బియ్యం తప్ప మిగిలినవేమీ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వస్తువుల ధరలూ పెంచి.. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నారని విమర్శించారు. మదనపల్లె, పీలేరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు.
Updated Date - Apr 17 , 2024 | 03:08 AM