రైతుల సహకారం ముఖ్యం
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:50 PM
రైతులు సహాకారం అందించి గ్రేడింగ్ చేసిన టమోటాను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర కల్పించగలమని మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి వెల్లడించారు.
గ్రేడింగ్ టమోటాకు గిట్టుబాటు ధర
మార్కెట్‌శాఖ ఏడిఎం నారాయణమూర్తి
పత్తికొండ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రైతులు సహాకారం అందించి గ్రేడింగ్ చేసిన టమోటాను మార్కెట్‌కు తీసుకొస్తే గిట్టుబాటు ధర కల్పించగలమని మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి వెల్లడించారు. శుక్రవారం పత్తికొండ మార్కెట్‌యార్డ్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి పత్తికొండ మార్కెట్‌కు వచ్చిన టమోటా పంటకు మంచి ధరలు లభించాయన్నారు. కాగా గడచిన ఖరీఫ్ సీజనకు సంబంధించి తమిళనాడు, తెలంగాణా ప్రాంతాల్లో అధికవర్షాలు కురవడంతో అక్కడ రైతులు సాగుచేసిన టమోటా పంట దెబ్బతిందన్నారు. దీంతో డిమాండ్ పెరగడంతో పత్తికొండ మార్కెట్ యార్డ్‌కు వచ్చిన గ్రేడింగ్ టమోటాతోపాటు నాసిరకం టమోటాను వ్యాపారులు మంచి ధరకు కొనుగోలుచేసి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో స్థానికంగా దిగుబడులు రావడంతో పత్తికొండ మార్కెట్ నుంచి వెళ్లే పంటకు డిమాండ్ తగ్గిందన్నారు. అయితే పత్తికొండ మార్కెట్‌లో వ్యాపారులు గ్రేడింగ్ టమోటాను గిట్టుబాటు ధరకు కొంటున్నారని, నాసిరకం పంటను మాత్రమే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీనికితోడు ప్రభుత్వం తరపున మార్కెట్‌శాఖ గిట్టుబాటు ధరలకు పంటను కొనుగోలుచేసి విజయవాడ, కర్నూలు వంటి ప్రాంతాల్లో రైతుబజార్లకు పంటను రోజుకు 10నుంచి20 టన్నులమేర తరలిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి రైతుబజార్లకు తరలించాలన్నా గ్రేడింగ్‌తో నాణ్యత కలిగిన టమోటా కావాల్సి ఉంటుందన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలంటే రైతులు తమకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఆంధ్రజ్యోతి కథనంతో
అధికారుల పర్యటన
‘టమోటా కిలో రూ.1’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనానికి మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించారు. శుక్రవారం ఆర్డీవో భరతనాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి రామాంజినేయులు పత్తికొండ మార్కెట్‌యార్డ్‌లో టమోటా కొనుగోళ్లను పరిశీలించారు. ఆర్డీవో భరతనాయక్ రైతులు, వ్యాపారులతో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు. కాగా శుక్రవారం టమోటా ధర కిలో రూ8 నుంచి రూ.18 వరకు పలికినట్లు కార్యదర్శి కార్నలీస్ తెలిపారు.
Updated Date - Dec 13 , 2024 | 11:50 PM