భ్రష్టు పట్టించారు!
ABN, Publish Date - Jun 14 , 2024 | 03:46 AM
మూడంటే మూడు నిమిషాలు! అయితేనేం... చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు క్లాస్ తీసుకున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్‌లపై గౌరవం ఉండేది
కానీ, ఐదేళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు
అజెండాతో పనిచేసి వ్యవస్థలను దెబ్బతీశారు
ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి
సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం ‘క్లాస్’
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మూడంటే మూడు నిమిషాలు! అయితేనేం... చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు క్లాస్ తీసుకున్నారు. మరీముఖ్యంగా... జగన్ ప్రభుత్వ హయాంలో గీతదాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. ‘మీపట్ల గతంలో ఉన్న గౌరవం పోయింది’ అని చెప్పకనే చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిలభారత సర్వీసు అధికారులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరినీ ఒక హాలులో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. ‘‘నేను ఉమ్మడి రాష్ట్రానికీ, నవ్యాంధ్రకూ ముఖ్యమంత్రిగా పని చేశాను. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని అయ్యాను. నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు నిబద్ధతతో పనిచేసేవారు. నాకూ ఐఏఎస్, ఐపీఎ్‌సలంటే గౌరవం ఉండేది. వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేది. కానీ... గత ఐదేళ్లలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. నిబంధనలు పక్కన పెట్టి, ఒక అజెండాతో పని చేసి మొత్తం డ్యామేజ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఊహించలేదు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నడూ లేనంత కసి కనిపించడానికి కారణం... ఐదేళ్లలో జరిగిన దారుణాలే. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటంలేదు. ఎప్పుడూ మాట్లాడను కూడా. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే నా బాధ. ఇప్పుడు వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులంతా గుంభనంగా, మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తనకు సమయం లేదని రెండు, మూడు రోజుల్లో మరోసారి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అప్పుడు అన్ని అంశాలపైనా సుదీర్ఘంగా చర్చిద్దామని అక్కడి నుంచి వచ్చేశారు.
గుబులు... బెంబేలు...
బ్యూరోక్రాట్లకు చంద్రబాబు అత్యంత గౌరవం, విలువ ఇస్తారు. వారిని గౌరవంగా చూసుకుంటారు. అలాంటిది ఆయనే ప్రస్తుత పరిస్థితిపై ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. చట్టాలు, నిబంధనలు పాటించకుండా... ‘తాడేపల్లి’ ఆదేశాలనే శాసనంగా భావించి అమలు చేసిన ఐఏఎ్‌సలు... ఐపీసీ పక్కనపెట్టి ‘వైసీపీ’కి జైకొట్టిన ఐపీఎ్‌సలు అనేకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలతో వీళ్లందరిలోనూ గుబులు మొదలైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో చట్టాన్ని మీరి పని చేసి, వివాదాస్పదమైన అధికారులు ఇప్పుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడ్డారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలు, జగన్ సీఎం కాగానే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురువారం బొకేతో సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎం ముఖ్య కార్యదర్శి మినహా ఇతర అధికారులు చాంబర్‌లో ఉండొద్దని చంద్రబాబు ముందే చెప్పారు. ఇతర అధికారులంతా సమావేశ మందిరంలో ఉండాలని, తానే అక్కడి వస్తానని స్పష్టం చేశారు. కానీ... శ్రీలక్ష్మి బొకే తీసుకుని తలుపు తోసుకుని సీఎం చాంబర్‌లో అడుగుపెట్టారు. సీఎం కొంత అసహనంతో ఆమె వైపు చూశారు. సీఎస్ నీరబ్ కుమార్ ఆమె వద్దకు వెళ్లి... అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినట్లు తెలిసింది. ఇక... ఐదేళ్లు జగన్‌కు వీర విధేయుడిగా, టీడీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా పని చేసిన ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కూడా సీఎం చాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన తలుపు వద్ద వేచి చూస్తుండగానే.. ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజీత్ వెళ్లి, మీటింగ్ హాలులోకి వెళ్లాలని అక్కడి నుంచి పంపించేశారు. గత ప్రభుత్వంలో స్వామి భక్తి పరాయణులుగా గుర్తింపు పొందిన అధికారులు సీఎంకంటే ముందుగా వచ్చి, ఆయన కుర్చీకి బాగా దగ్గరగా కూర్చున్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఒక్కో అధికారి వరుసలో ఆయన వద్దకు వచ్చి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఫొటోలు దిగాల్సి ఉంది. చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. తన సీటుకు దగ్గరగా కూర్చున్నవారు ఇద్దరు ముగ్గురు ఇచ్చిన బొకేలను ముభావంగా తీసుకొని టేబుల్ మీద పెట్టేశారు. సునీల్ కుమార్ కూడా పుష్ప గుచ్ఛం ఇవ్వగలిగారు. ఆయన వైపు కనీసం చూడకుండా చంద్రబాబు దానిని తీసుకొని టేబుల్ మీద పెట్టేశారు. తాను కొత్త సీఎంకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోను సునీల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనకు పుష్ప గుచ్ఛం ఇవ్వడానికి గబగబా దగ్గరకు రాగా... చంద్రబాబు ఆయన వైపు చూడకుండానే వెళ్లిపోయారు.
వారి పేర్లు కనపడొద్దు!
ఐదు సంతకాలకు సంబంధించిన జీవోలను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాల్సి ఉంది. కానీ.. ఆ అధికారుల పేర్లు కనిపించకూడదనే ఉద్దేశంతో కాబోలు, సీఎస్ సంతకాలతోనే అవి వెలువడ్డాయి. డీఎస్సీపై ప్రవీణ్ ప్రకాశ్, అన్న క్యాంటీన్లపై శ్రీలక్ష్మి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అజయ్ జైన్, పించన్ల పెంపుపై శశి భూషణ్ సంతకాలతో జీవోలు జారీ చేయాల్సి ఉంది. కానీ... కొత్త ప్రభుత్వం వీరెవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. సీఎస్ పేరిటే సంబంధిత జీవోలు వెలువడ్డాయి.
Updated Date - Jun 14 , 2024 | 03:46 AM