రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత
ABN, Publish Date - Nov 30 , 2024 | 04:56 AM
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని మొండి రిషితేశ్వరి కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి నీలిమ శుక్రవారం తీర్పు వెలువరించారు.
నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది: కోర్టు
ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటన
9 ఏళ్లపాటు సాగిన కేసులో గుంటూరు కోర్టు తీర్పు
గుంటూరు (లీగల్), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని మొండి రిషితేశ్వరి కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి నీలిమ శుక్రవారం తీర్పు వెలువరించారు. నిందితులపై పూర్తి సాక్షాధారాలతో కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, సంశయ లాభం కింద ముద్దాయిలను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా సుబేదారికి చెందిన రిషితేశ్వరి ఇందిరా ప్రియదర్శిని లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందింది. సీనియర్ విద్యార్థుల ఈవ్‌టీజింగ్‌తో పాటు ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ, ప్రజా సంఘాలతోపాటు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. రిషితేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దుంప హనీషా నాగ సాయిలక్ష్మి, నాలుగో సంవత్సరం చదువుతున్న ధారావత్ జై చరణ్ నాయక్, నరాల శ్రీనివా్‌సతో పాటు ప్రిన్సిపాల్ గూడవల్లి బాబురావును నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. పై ముగ్గురు విద్యార్థుల వేధింపుల వల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.
కేసు దర్యాప్తు అనంతరం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ రామాంజనేయులు తనతోపాటు మరో 50 మందిని సాక్షులుగా చూపుతూ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు కోర్టులో విచారణ జరిగింది. 37 మందిని సాక్షులుగా విచారించారు. తొలుత ఈ కేసులో పోక్సో కోర్టు ఏపీపీ శ్యామల ప్రాసిక్యూషన్ నిర్వహించగా సీనియర్ న్యాయవాదులు గరికపాటి కృష్ణారావు, ఉమ్మడిశెట్టి మహతి శంకర్, బీరం సాయిబాబు, సాయి మనోహర్రావు, జోసెఫ్ రవికుమార్.. నిందితుల తరఫున డిఫెన్స్ నిర్వహించారు. కేసు చివరి దశలో గత ప్రభుత్వం సీనియర్ న్యాయవాది వైకేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. అనంతరం దాదాపు నెల రోజులపాటు సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం తీర్పు రానుందని తెలియడంతో కోర్టు ఆవరణలో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కోర్టు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించగానే.. రిషితేశ్వరి తల్లిదండ్రులు అక్కడే బోరున విలపించారు. మరోపక్క నిందితుల తరఫు తల్లిదండ్రులు, బంధువులు ఇప్పటికైౖనా న్యాయం గెలిచిందని, కొందరు రాజకీయ, ప్రజా సంఘాల ముసుగులో స్వలాభం కోసమే తమ పిల్లల్ని బలి పశువుల్ని చేశారని అన్నారు. కాగా, రిషితేశ్వరి కేసులో కోర్టు తీర్పు తమకు సమ్మతం కాదని దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామని సీనియర్ న్యాయవాది వైకేతో పాటు రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి తెలిపారు.
Updated Date - Nov 30 , 2024 | 04:56 AM