వ్యవస్థలను కుప్పకూల్చారు!
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:33 AM
రాష్ట్రంలో గత ఐదేళ్లలో వ్యవస్థలను కుప్పకూల్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రత్యేక సీఎ్‌సలు, ముఖ్య కార్యదర్శులు,
సెక్రటరీలు, హెచ్‌వోడీలతో బాబు భేటీ
2014లో కంటే దారుణ పరిస్థితులు
విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం
రూ.లక్ష కోట్ల వరకు బిల్లులు, బకాయిల పెండింగ్
13.5ు వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం పరిస్థితి ఇదీ!
కేంద్రం సాయం చేస్తామనడం శుభపరిణామం
గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారిమళ్లించింది
యూసీలు కూడా ఇవ్వలేదని ఢిల్లీలో చెప్పారు
అధికారులు సెన్సిటివ్‌గా పనిచేయాలి
మీమీ శాఖల్లో వ్యవస్థలను క్రియాశీలం చేయండి
యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్లలో వ్యవస్థలను కుప్పకూల్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే ఐదేళ్లూ అధికారులందరూ కష్టపడి పని చేసి రాష్ట్రాన్ని నిలబెట్టాలని కోరారు. బుధవారం సాయంత్రం సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, విభాగాధిపతు(హెచ్‌వోడీ)లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వ విధానమేంటో విశదీకరించారు. యంత్రాంగం ఎలా పని చేయాలో దిశానిర్దేశం చేశారు. 2014లో కంటే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రూ.లక్ష కోట్ల వరకు బిల్లులు, బకాయిలు ఉన్నాయని.. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పారు. 13.5 శాతం వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన కంటే ఎక్కువ నష్టం గత ఐదేళ్ల వైసీపీ వైసీపీ పాలన వల్ల జరిగిందన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. ‘కేంద్రం సాయం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామం. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడానికీ ముందుకొచ్చింది. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.
కేంద్ర నిధులపై దృష్టి పెట్టండి..
తన హయాంలో తెచ్చిన పాలసీలన్నీ జగన్ పక్కన పడేశారని చంద్రబాబు తెలిపారు. ‘నాడు ఈ-సేవ తెచ్చాం.. రియల్ టైం గవర్నెన్స్ తెచ్చాం. ఇలాంటి వ్యవస్థలన్నిటినీ మూలన పడేశారు. మీ మీ శాఖల్లో ఉన్న వ్యవస్థలను యాక్టివ్ చేయండి. అధికారులు కూడా సెన్సిటివ్‌గా పని చేయాలి. కేంద్రం ఏయే శాఖలకు ఎంత నిధులు ఇస్తుందో తెలుసుకోవాలి. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర పథకాలు కూడా ఉపయోగించుకోలేదు. నేను ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తే.. గత ప్రభుత్వం కనీసం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) కూడా ఇవ్వలేదని, నిధులు దారి మళ్లించారని చెప్పారు. అంటే గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో ఆలోచించాలి. నేను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాష్ట్రంలో ఎప్పుడూ లేనన్ని సమస్యలు, భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి’ అని చెప్పారు. ఏడాదిలో కేంద్రం నుంచి ఎంత మేర నిధులు తేగలమో చూసి.. అవన్నీ తెచ్చేలా అధికారులు పని చేయాలన్నారు. కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం నిధులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటామన్నారు. రౌడీలను అణచివేస్తామని.. గంజాయి అనేది లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు సమర్థంగా పని చేయాలన్నారు. మద్యం, మైనింగ్‌లో భారీ అవినీతి చేశారని.. దీనిని వెలుగులోకి తీసుకొచ్చే పని ప్రారంభించామని చెప్పారు. ‘పేదరికం లేని సమాజం అనేది మా ప్రభుత్వం లక్ష్యం. దీని కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలసీలు పక్కాగా అమలు చేయడం ద్వారా పేదరికం తగ్గించవచ్చు. కలిసి ముందుకు వెళ్దాం. ప్రగతిశీల, ప్రభావాత్మక పాలన అందిద్దాం’ అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టి తదనుగుణంగా పని చేయాలని చెప్పారు. అమరావతికి మూడేళ్లలో ఒక రూపం తీసుకురావాలని నిర్ణయించామని.. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
అలాంటివారు మాకు వద్దు..
బదిలీల్లో భాగంగా అందరికీ మంచి శాఖలే ఇచ్చామని.. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చంద్రబాబు అధికారులను కోరారు. ‘జగన్ జమానాలో మాదిరిగా వ్యవహరిస్తాం.. పనిచేయబోమని అంటే.. నమస్కారం పెట్టి మీరే వెళ్లిపోండి. మాకు అవసరం లేదు.. అభివృద్ధిని పాడుచేయొద్దు’ అని స్పష్టం చేశారు. వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద కొన్ని స్కీములకు కేంద్రమే నిధులిస్తోందని.. దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం ఉండదని.. నిర్వహణ కూడా తేలికవుతుందని.. అలాంటి స్కీములపై దృష్టిపెట్టి నిధులు వచ్చేలా కృషిచేయాలని కోరారు.
ఏపీలో తలసరి ఆదాయం..
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోందని.. నాడు తాను తీసుకున్న నిర్ణయాలు, తెచ్చిన పాలసీల వల్లే ఇది సాధ్యమైందని సీఎం చెప్పారు. ‘అమెరికాలో కూడా భారతీయులే ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నారు. వైట్ అమెరికన్స్ 65 వేల డాలర్లు పొందుతుంటే.. మనవాళ్ల తలసరి రాబడి 1.19 లక్షల డాలర్లుగా ఉంది. తెలుగు వాళ్లు ప్రపంచంలో, దేశంలో ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తద్విరుద్ధమైన పరిస్థితి నెలకొంది’ అని బాధపడ్డారు.
నిశ్శబ్ద విప్లవం..
‘మూడు పార్టీలుగా కలిసి పోటీ చేశాం. ఎన్నికల సమయంలో ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని చెప్పాం. దానిని నిజం చేసి చూపించారు’ అని చంద్రబాబు తెలిపారు. మొన్నటి ఎన్నికలు ఒక నిశ్శబ్ద విప్లవమన్నారు. ఈ ఫలితాలతో కొత్త చరిత్రకు నాంది పలికినట్లు చెప్పారు. ‘మా కూటమికి 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. 57 శాతం ఓట్ షేర్ వచ్చింది. గత ఐదేళ్లలో ప్రజలు పడిన కష్టాల కారణంగా వచ్చిన ఫలితం ఇది. గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన వాళ్లు, ఇతర దేశాల్లో ఉన్న వారు వచ్చి ఓట్లు వేశారు’ అని వివరించారు.
బాబుతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ భేటీ
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): భారత్‌లోని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓమ్ బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని సంస్కృతి, సంప్రదాయాలు, మంచి పర్యావరణ వ్యవస్థ, ఇక్కడ నెలకొన్న వ్యాపార అనుకూలతలు, బిజినెస్ ఫ్రెండీ గవర్నమెంట్ మీ కోసం వేచి ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆహ్వానించానని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమయ్యారు.
ఓట్లు వేరు.. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మంచి చేశామనే ఒక తృప్తి ఉంటుంది. నా అరెస్టు సమయంలో అంత మంది రోడ్డెక్కడానికి.. అంతకుముందు నేను చేసిన మంచే కారణం. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు.
అధికారులు బ్యూరోక్రటిక్ కోణంలో కాకుండా, మానవీయ కోణంతో పని చేయాలి. ప్రజలు సాయం కోరి వస్తే, ఆ సమస్య ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. కేవలం రూల్స్ గురించే ఆలోచిస్తే అందరికీ మంచి చేయలేం.
- సీఎం చంద్రబాబు
భవిష్యత్‌లోనూ ఇలాగే ఆదుకోండి అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వినతి
అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం సాయంత్రం వారితో ఆయన ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రం ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి, కేటాయింపులు చేయడం అభినందనీయమన్నారు. ఏపీకి చేసిన కేటాయిపులతో ఎంతో మేలు జరుగుతుందని, రాష్ట్ర పునర్మిర్మాణంపై ప్రజలకు నమ్మకం కలిగించాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి తాము కూడా కట్టుబడి ఉన్నామని, భవిష్యత్‌లో మరింతగా సహకరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
Updated Date - Jul 25 , 2024 | 04:33 AM