దళితులపై దౌష్టికం!
ABN, Publish Date - Apr 25 , 2024 | 05:30 AM
దళిత మహిళ అన్న కనికరం లేదు. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టరన్న గౌరవం లేదు. పేదలన్న జాలి, దయ లేవు.
జగన్ పాలనలో దాడులు, హత్యలు.. ఎవరైనా ప్రశ్నిస్తే బతకలేని పరిస్థితి
డాక్టర్ సుధాకర్‌కు నడిరోడ్డుపై చిత్రహింసలు
ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మృతి
యువకుడికి స్టేషన్‌లోనే శిరోముండనం
ట్రాక్టర్‌తో తొక్కించి అంగన్వాడీ హత్య
జగన్‌ను దూషించినందుకు
శవమై తేలిన సొంత పార్టీ కార్యకర్త
గత ఐదేళ్లలో ఎన్నెన్నో దాడులు
నిందితులకే వైసీపీ సర్కారు వత్తాసు
దళిత మహిళ అన్న కనికరం లేదు. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టరన్న గౌరవం లేదు. పేదలన్న జాలి, దయ లేవు. అన్యాయాలను, హక్కులను ప్రశ్నిస్తే సమాజంలో బతకలేని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల పాలనలో దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. పోలీసులను ఉసిగొల్పి చిత్రహింసలు పెట్టించారు. దళిత కాలనీలపై మారణాయుధాలతో తెగబడ్డారు. కొందరిని భౌతికంగా లేకుండా చంపేశారు. అయినా జగన్ సర్కారు బాధితులకు అండగా నిలవకపోగా.. దౌర్జన్యాలకు పాల్పడిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకే వత్తాసు పలికింది. సీఎం జగన్ సహా మంత్రులు హంతకుడిని బహిరంగంగా పక్కనపెట్టుకుని తిరిగిన సంఘటనలున్నాయి. జగన్ పాలనలో దళితులపై జరిగిన దాడులు మచ్చుకు కొన్ని..
జగన్ మాటల్లోనే ప్రేమ..
నా ఎస్సీలు’ అంటూ సీఎం జగన్ ప్రేమ ఒలకబోస్తారు. దళితులను ఉద్ధరిస్తున్నట్టు గొప్పలు చెబుతారు. కానీ ఆయన ఐదేళ్ల పాలనలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రశ్నిస్తే దాడులు, శిరోముండనం, హత్యలు. ఎదురొస్తే వైసీపీకి చెందినవారైనా సరే వదిలిపెట్టరు. అయినా నిందితులపై చర్యలు లేవు. పైగా పార్టీలో పెద్దపీట వేస్తారు. ఇదీ జగన్ మార్క్ రాజకీయం.
దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబును అన్నివిధాలా రక్షించారు.
దళిత యువకులకు శిరోముండనం కేసులో శిక్షపడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.
ఇసుక దోపిడీ చేస్తున్న వైసీపీ నేతలను ప్రశ్నించిన దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో అధికార నేతల ఒత్తిడితో శిరోముండనం చేయించారు. రాష్ట్రపతి స్వయంగా స్పందించినా బాధ్యులపై నేటికీ కనీస చర్యలు లేవు.
డాక్టర్ సుధాకర్‌పై ఘోరం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దళిత డాక్టర్ కె.సుధాకర్ (52) ఘటనలో ఆ కుటుంబానికి ఇప్పటివరకూ న్యాయం జరగలేదు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేసిన డాక్టర్ సుధాకర్.. కరోనా సమయంలో 2020లో రోగులకు చికిత్స చేసే వైద్యులకు కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సాధారణంగా అయితే ప్రభుత్వం స్పందించి అన్ని ఆస్పత్రులకూ అవసరమైన గ్లౌజులు, మాస్క్‌లు సరఫరా చేయాలి. కానీ డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. మాస్క్‌లు అడగడం నేరమా? అని ఆయన ప్రశ్నించినందుకు వైసీపీ పెద్దలు వ్యక్తిగతంగా కక్షగట్టారు. గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తిని జాతీయ రహదారిపై దుస్తులు లేకుండా నిలబెట్టి పోలీసులతో లాఠీలతో కొట్టించారు. ‘సైకో’ ముద్రవేసి మానసిక వైద్యశాలలో పడేశారు. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది. ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన డాక్టర్ సుధాకర్ ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మరణించారు.
చంపేసి.. డోర్ డెలివరీ
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి అతడి ఇంటికే మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అర్ధరాత్రి కాకినాడ బీచ్ రోడ్డులో సుబ్రహ్మణ్యంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. డ్రైవర్ మృతదేహాన్ని అనంతబాబు తన కారులోనే అతడికి ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబీకులు నిలదీయడంతో ‘డబ్బులు ఇస్తా నోరు తెరవొద్దు’ అని బెదిరించారు. ఆగ్రహంతో బాధితులు నిలదీయడంతో కారు వదిలేసి పారిపోయారు. అనుమానాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు.. బాధితులు, దళిత సంఘాల ఆందోళనతో హత్య కేసుగా మార్చారు. ఆ తర్వాత అనంతబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జగన్ ప్రకటించినా.. ఆయన్ను పక్కన పెట్టుకుని వైసీపీ మంత్రులు, సీఎం బహిరంగ సభలకు హాజరవుతుండడం గమనార్హం.
యువకుడికి శిరోముండనం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్నారనే కారణంతో 2020 జూలై 20న ఇండుగుమిల్లి వరప్రసాద్ అనే యువకుడిని సీతానగరం పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు గుండు గీశారు. ఈ కేసులో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిందితులకు అండగా ఉన్నట్టు అప్పట్లో దళితులు ఉద్యమించారు. బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ కేసులో స్థానిక వైసీపీ నాయకుడితో పాటు ఆరుగురు నిందితులుగా ఉన్నారు. దళితుల ఆందోళనలతో ఎట్టకేలకు ఎస్‌ఐని సస్పెండ్ చేశారు.
నిందితుడికి టికెట్
దళితులకు శిరోముండనం కేసులో శిక్షపడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు వైసీపీ మండపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తాజాగా దళితుల ఆగ్రహ కారణంగా మారింది.
దళిత యువకుడు బలి
తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరులో వైసీపీ వర్గపోరుకు బొంతా మహేంద్ర అనే యువకుడు బలైపోయారు. హోంమంత్రి తానేటి వనితకు సంబంధించిన ఫ్లెక్సీలో వనితతో పాటు కొందరి చిత్రాల తలల భాగాలు కత్తిరించి ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానితుడిగా మహేంద్రను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనను అన్యాయంగా ఇందులో ఇరికించారని, దీనివల్ల తన పరువు పోయిందని తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్త హత్య
గత ఏడాది జూన్ 5న ప్రకాశం జిల్లా టంగుటూరు పంచాయతీ పరిధిలో రావివారిపాలెం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త సవలం హనుమాయమ్మ(ఎస్సీ)ను ప్రత్యర్థులు రాజకీయ కారణాలతో దారుణంగా చంపేశారు. ఇంటి పక్కన ఉండే వైసీపీకి చెందిన ఆమె బంధువులే పథకం ప్రకారం హత్య చేశారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న హనుమాయమ్మను సవలం కొండలరావు అనే యువకుడు ట్రాక్టర్‌తో ఢీకొట్టి తొక్కించాడు.
దళిత కాలనీపై దాష్టీకం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని దళిత కాలనీపై 2022 జూన్‌లో అర్ధరాత్రి వైసీపీ నేత దాడికి తెగబడ్డారు. తన అనుచరులు 15మందితో కలిసి కర్రలు, రాడ్లు, కత్తులు, బీరు బాటిళ్లతో వెంకటేశ్వర కాలనీలో విరుచుకుపడ్డారు. గంజాయి, మద్యం తాగి బీభత్సం సృష్టించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కాలనీవాసులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. అప్పటి ఎస్‌ఐ సంపత్‌కుమార్ బాధితులపైనే లాఠీ ఝుళిపించారు.
కోనసీమలో కులచిచ్చు
రెండేళ్ల కిందట కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనలు ప్రజల నుంచి పెద్దఎత్తున వచ్చాయి. అదే సమయంలో కోనసీమగానే పేరు పెట్టాలంటూ మరోవైపు డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసింది. ఈలోపు అటు దళితులు, ఇటు ఇతర సామాజికవర్గాల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అనంతరం ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును ప్రకటించడంతో సున్నితమైన ఈ అంశం కులఘర్షణలకు దారితీసింది. 2022 మే 22న అమలాపురం కేంద్రంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వంపై దళిత సంఘాలు ఇప్పటికీ గుర్రుగానే ఉన్నాయి.
కాళ్లూ చేతులు కట్టేసి..
గతేడాది ఆగస్టులో జరిగిన పుంగనూరు అల్లర్ల ఘటన కేసులో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. అప్పటి కల్లూరు సీఐ శ్రీనివాసులు హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్టు చేసి.. కల్లూరు పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చి కాళ్లూ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా కొట్టారు. సీఐ కొడుతున్నప్పుడు ఎవరో ఓ వైసీపీ నేతకు వీడియో కాల్ చేసి చూపించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మంత్రి పెద్దిరెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న కారణంగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నించినట్లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
జగన్‌ను దూషించినందుకు..
2020 ఆగస్టు 25న చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన వైసీపీ దళిత కార్యకర్త ఓంప్రతాప్ మదనపల్లెలోని ఓ మద్యం దుకాణం వద్ద నాణ్యత లేని మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో దూషించారు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. మరుసటిరోజు ఓంప్రతాప్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైసీపీ వాళ్లే హత్య చేశారని, రీపోస్టుమార్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
కౌలురైతు దంపతులపై దాడి
బాపట్ల జిల్లా చుండూరుపల్లి గ్రామంలో దళిత కౌలురైతు దంపతులపై వైసీపీ సానుభూతిపరులు దాడి చేసిన ఘటన గతేడాది జూన్‌లో జరిగింది. పొలం కౌలు విషయంలో జరిగిన గొడవలో దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Updated Date - Apr 25 , 2024 | 05:30 AM