ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూలీలపై మృత్యు పంజా

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:41 AM

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారిపాక సమీపంలో జీడిపిక్కల బస్తాలతో వెళ్తున్న మినీ వ్యాను అదుపు తప్పి కాల్వలో పడడంతో ఏడుగురు జట్టు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

జీడిపిక్కల వ్యాన్‌ అదుపు తప్పి కాల్వలో బోల్తా

బస్తాల కింద పడి ఊపిరాడక ఏడుగురు దుర్మరణం

డ్రైవర్‌ సహా మరో నలుగురు సురక్షితం

తూర్పు గోదావరి జిల్లా చిన్నాయిగూడెంలో ఘోరం

కన్నీటి సంద్రమైన తాడిమళ్ల గ్రామం

మృతుల కుటుంబాలకు రూ.ఐదేసి లక్షల ఎక్స్‌గ్రేషియా

దేవర పల్లి, సెప్టెంబరు 11: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారిపాక సమీపంలో జీడిపిక్కల బస్తాలతో వెళ్తున్న మినీ వ్యాను అదుపు తప్పి కాల్వలో పడడంతో ఏడుగురు జట్టు కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి వెళ్తుండగా గతుకుల రోడ్డు కారణంగా మంగళవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. మృతులంతా తాడిమళ్ల గ్రామానికి చెందినవారే. తాడిమళ్లలో సుమారు 100 వరకు జీడి పిక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. జీడిపిక్కలను బస్తాల్లో పట్టడం, ఎగుమతి, దిగుమతికి తాడిమళ్లతోపాటు.. చుట్టు పక్క గ్రామాల నుంచి పురుషులు జట్టు కూలీలుగా పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కాత్తవ కృష్ణ(మేస్త్రి-40) ఆధ్వర్యంలో కాత్తవ నారాయుడు(45), తాడి రామకృష్ణ(45), తమ్మిరెడ్డి సత్యనారాయణ(44), దేశాల వీర వెంకటరావు (బూరయ్య-40), బొక్కా ప్రసాద్‌ (35),

పెనుగుర్తి చినముసలయ్య(35) జట్టుగా మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వ్యానులో బయలుదేరి జంగారెడ్డిగూడెం మండలం బొర్రంపాలెం వెళ్లారు. వీరంతా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందినవారు కాగా, బొక్కా ప్రసాద్‌ (40)ది కాటాకోటేశ్వరం గ్రామం. వీరంతా జీడి పిక్కలను బస్తాల్లోకి ఎత్తి ఎగుమతి చేసుకొని అక్కడి నుంచి రాత్రి 8 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వ్యాను చిన్నాయిగూడెం దగ్గరలోని చిలకవారిపాకలు(పట్టాభిపురం-తాడిమళ్లకు 15కి.లో.దూరం) వద్ద బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్క తుప్పలతో నిండిన చిన్న లోయలాంటి కాల్వలో బోల్తాపడింది. దీంతో ఎనిమిది మందిలో ఏడుగురు 15 టన్నుల లోడు బస్తాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాను క్యాబిన్‌లో ఉన్న ఇమ్మానుయెల్‌ అనే మరో కూలీ, డ్రైవరు, క్లీనరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ వ్యానుకు ముందు వెళుతున్న మరో వ్యానులో జీడిపిక్కల ఫ్యాక్టరీ యజమాని అనుచరుడు నాగబాబు, మరో నలుగురు జట్టు కూలీలు ఉన్నారు. ఇమ్మానుయెల్‌ ఫోన్‌ చేయడంతో వారితోపాటు స్థానికులు వచ్చి సుమారు 2 గంటలపాటు శ్రమించి మొత్తం ఎనిమిది మందినీ బయటకు తీశారు.

అందులో ఏడుగురు చనిపోగా, తీవ్రగాయాలైన గంటా మఽఽధును 108 వాహనంలో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ మాపాటి శివాజీ పరారీలో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో డీఎస్పీ దేవకుమార్‌ ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. వ్యాను రోడ్డుపై డ్రైవర్‌ గోతులను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడిందని చెప్పారు. అలాగే మెయిన్‌ రోడ్డులోంచి రావాల్సిన ఈ వ్యాన్‌ చెక్‌పోస్టులో సెస్‌ తప్పించుకోవడానికి అర్ధరాత్రి ఈ అడ్డరోడ్డులో వచ్చిందన్నారు.. ఎస్పీ నరసింహకిశోర్‌ బుధవారం ఉదయం ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులంతా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన వారే కావడంతో ఆ గ్రామం అంతటా రోదనలతో నిండిపోయింది. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాల వద్ద వారి విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది.

Updated Date - Sep 12 , 2024 | 03:41 AM

Advertising
Advertising