ఓటమిని ఎదుర్కోవడం చాలా కష్టం!
ABN, Publish Date - Jul 16 , 2024 | 04:27 AM
ఐదేళ్ల కిందటి పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంత దూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీకి 11 సీట్లు వస్తే అసెంబ్లీకే రావడం లేదు: పవన్
పరాజయాలను తట్టుకుని నిలబడ్డాం.. మరొకరైతే పార్టీని వదిలేసేవారు
నేను లేకపోతే పార్టీ లేదనుకునే తత్వం వీడాలి. ఎవరు లేకపోయినా జనసేన ప్రయాణం ఆగిపోదు. కాలం చాలా గొప్పది. మాకంటే గొప్పవారు ఎవరూ లేరనుకున్న వారినే 11 సీట్లకు పరిమితం చేసింది. క్రమశిక్షణరాహిత్యంతో నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురావొద్దు.
పదవి ఉన్నా లేకున్నా కడవరకూ ప్రజల కోసం పని చేయాలన్న తపనతోనే రాజకీయాలు మొదలు పెట్టాను. ఈ ప్రయాణంలో మొన్నటివరకూ అధికారం చూడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలకమైన శాఖలు తీసుకున్నాం. ఆ శాఖల్లో తగిన విధివిధానాలు నిర్ణయించి వాటిని పటిష్ఠంగా తీర్చిదిద్దుతా.
- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పోటీచేసిన 21 చోట్లా గెలవడం భేష్
100% స్ట్రైక్ రేటుపై అంతటా చర్చ
అంబానీ కుమారుడి పెళ్లిలోనూ ఇదెలా సాధ్యమైందని అడిగారు
వైసీపీ పాలనలో భయంతో బతికారు
రోడ్లపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు
సొంత ఎంపీనే బంధించి హింసించారు
చివరికి చంద్రబాబునూ జైల్లో పెట్టారు
వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు
రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే
వ్యక్తిగత దాడులు కరెక్టు కాదు
టీడీపీ, బీజేపీ నేతలను తగ్గించి మాట్లాడొద్దు.. నేతలకు పవన్ సూచన
పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆత్మీయ సత్కారం
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల కిందటి పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంత దూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మరొకరైతే పార్టీని అప్పుడే వదిలేసేవారని చెప్పారు. గత పాలక పక్షానికి ఇప్పుడు 11 సీట్లు రాగానే అసెంబ్లీకి కూడా రాకుండా ఉండిపోయారని.. అంటే ఓటమిని తట్టుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన తరఫున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఆయన ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాక్షస పాలన అంతం చేయడానికి ప్రజలు ఎంతో నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా చేసిన ఓటు పోరాటం గొప్పదన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో డబ్బు వెచ్చించి మరీ రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని కొనియాడారు. ఆ ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా గౌరవించాలని.. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా పని చేయాలని కోరారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో విశ్వాసంతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. మనమంతా సమష్టిగా పని చేసి వారికి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలని పిలుపిచ్చారు. ‘గత వైసీపీ పాలనలో ప్రజలంతా భయం గుప్పిట్లో బతికారు. రోడ్డు మీదకు రావాలంటే భయం. అభిప్రాయం తెలియజేయాలంటే భయం. కనీసం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. బూతులు, బెదిరింపులు, కేసులు, వ్యక్తిగత దూషణలు గత ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయి. సాక్షా త్తూ ప్రజల చేత ఎన్నికైన ఎంపీని బంధించి భౌతికంగా హింసించిన తీరు అందరికీ తెలిసిందే. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును 54 రోజుల పాటు జైల్లో పెట్టించారు’ అని గుర్తుచేశారు. గత ప్రభుత్వ దాష్టీకాలను బలంగా ఎదురొడ్డి నిలిచింది ఒక్క జనసేన మాత్రమేనన్నారు. తప్పు జరిగిన ప్రతి చోటా జనసైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకు వచ్చి పోరాడిన తీరు ఐదు కోట్ల మంది ప్రజలకు బలమైందని తెలిపారు. జనసేన పోటీ చేయని చోట కూడా బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలా సహకరించారని వారిని అభినందించారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
అంబానీ ఇంటా 100ు స్ట్రైక్ రేటు..
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన ప్రతి చోటా గెలవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. మనం తీసుకున్న 21 అసెంబ్లీ సీట్లు 175లో తక్కువే కావచ్చు. కానీ కూటమి 164 చోట్ల విజయ దుందుభి మోగించడంలో ఆ 21 సీట్లే వెన్నెముక అయ్యాయి. ఈ గెలుపు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చగలిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో రాజకీయ నిపుణులకు, రాజనీతి శాస్త్ర విభాగంలో ఒక కేస్ స్టడీ అయింది. జాతీయ స్థాయిలో నేను ఎక్కడకు వెళ్లినా నన్ను అమితంగా గౌరవించడానికి ఈ విజయం ఎంతో దోహదపడుతోంది. ఇటీవల ముఖేశ్ అంబానీ కుమారుడి వివాహానికి ముంబై వెళ్లిన సమయంలోనూ అక్కడి అతిథులు జనసేన 100 శాతం స్లైక్ రేట్‌ను ప్రస్తావించి.. ఇదెలా సాధ్యమని అడగడం గొప్పగా అనిపించింది. గెలిచినవారికి కూడా ఊహించని మెజారిటీలు వచ్చాయి. ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకమని గుర్తించాలి. మన బలం 7 శాతం నుంచి 20 శాతానికి పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఇంత అడ్డగోలు వ్యయమా?
గత ప్రభుత్వంలో పెట్టిన అడ్డగోలు ఖర్చులు, వినియోగం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇవి చూశాక కార్యాలయంలో ఫర్నీచర్ కూడా కొనుగోలు చేయవద్దని సొంత ఫర్నిచర్‌నే వాడుతున్నాను. ప్రజాధనాన్ని రూపాయి కూడా అనవసరంగా వృథా చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. రూ.200 కోట్లు ఖర్చు పెడితే ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలను గత పాలకులు వదిలేశారు. రూ.600 కోట్లు ఖర్చు చేసి రుషికొండ ప్యాలె్‌స ఎందుకు కట్టారో తెలియదు. ప్రజాధనం వినియోగంలో జాగ్రత్త వహించాలి. చిన్నపాటి కుర్చీ ఉంటే దానిలో కూర్చునే పాలన సాగిద్దాం. పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేస్తుంటే పేదలకు వెళ్లే బియ్యాన్ని ఎలా తరలించేస్తున్నారో, అదెంత మాఫియానో ప్రజలకు తేటతెల్లమైంది.
అధికార దుర్వినియోగం సహించను
పార్టీని పటిష్ఠం చేయడానికి ఎవరి స్థాయిలో వారు బలంగా పని చేయాలి. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా జనవాణి నిర్వహించాలి. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యమివ్వండి. జనసేన నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగం చేస్తే సహించను. అధికారులతో చాలా హుందాగా మాట్లాడాలి. కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోనివ్వొద్దు. వారసత్వ రాజకీయాలకు మన పార్టీ వ్యతిరేకం కాదు. కానీ కుటుంబ సభ్యులను సహజ ధోరణిలో రాజకీయాల్లోకి తీసుకురావాలి. అలా కాకుండా జనం మీద రుద్ది వారిని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం సహించను. అలాగే మన నాయకులను మనమే ఇష్టానుసారం సోషల్ మీడియాలో తిడితే వారు నాకు విధేయులైనా, అమితంగా ఇష్టపడే వారైనా వదులుకోవడానికి సిద్ధం. ముఖ్యంగా మహిళా నేతలను ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. నేను జనం కోసం పని చేసేవాడిని. ప్రజల కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తా. నా సొంత బిడ్డలైనా ప్రజల తర్వాతే. వైసీపీ లాంటి రౌడీ పార్టీతోనే పోరాడి ఈ స్థాయికి వచ్చిన వాడిని. నాకు ఎలాంటి భయాలు ఉండవని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.
నా గుండెల్లో మీ స్థానం పదిలం..
కూటమి ప్రభుత్వం అంటే కేవలం ఒక పార్టీ ప్రభు త్వం కాదు. ఎన్నికల్లో ఉమ్మడి విజయం సాధించాం. టీడీపీ, బీజేపీ నాయకులను ఏ మాత్రం తగ్గించి మాట్లాడొద్దు. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచొద్దు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యమిస్తాం. ప్రభు త్వ నామినేటెడ్ పదవుల పంపకం కూటమి పార్టీల మధ్య జరుగుతుంది. కొందరికి ప్రభుత్వ పదవులు, మరికొందరికి పార్టీలో ఉన్నతస్థాయి పదవులు ఇస్తాం. ఏ పదవి ఇచ్చినా నా గుండెల్లో మీ స్థానం పదిలంగా ఉం టుందని అర్థం చేసుకోండి. ఉన్న అవకాశాలను బట్టి పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేలు వారానికొకరు చొప్పున పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ప్రజల వినతులను స్వీకరించి వారితో ప్రత్యేకంగా మాట్లాడాలి.
కూరగాయల గుచ్ఛాలు..
ఆత్మీయ సత్కారంలో ప్రజాప్రతినిధులకు పవన్ కూరగాయలతో చేసిన గుచ్ఛాలను అందజేశారు. వారికి అందజేసిన కూరగాయల గుచ్ఛాలను రెండు అనాథ శరణాలయాలకు విరాళంగా అందించారు. ఆ రెండు అనాథ శరణాలయాల నిర్వహణకు రూ.2 లక్షల విరాళం అందజేశారు. అలాగే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కలిసి ఆయన్ను సత్కరించారు. దశాబ్ద కాలంగా జనసేన సాగించిన ప్రయాణం స్వాతంత్య్ర ఉద్యమం తరహాలో సాగిందని పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
వ్యక్తిగత దాడులు కరెక్టు కాదు..
అధికారంలోకి వచ్చామని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ మనం చేయకూడదు. వైసీపీ నాయకులు మనకు శత్రువులు కాదు. కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. వారి విధానాలపైనే మన పోరాటం ఉండాలి. వ్యక్తిగత దాడులు కరెక్టు కాదు. కక్ష సాధింపులు, వ్యక్తిగత వేధింపులు, దూషణలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని నమ్ముకోవడం పూర్తిగా పక్కన పెట్టి ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం నింపేలా పని చేయాలి.
ప్రధాని బరువు దించేలా..
ప్రధాని మోదీతో ఏం మాట్లాడాలని ఇటీవల మన పార్టీ ఎంపీలు అడిగారు. 140 కోట్ల మంది భారతీయుల బరువు మోసే ఆయనకు.. మన తరఫున బరువు దించే అంశాలే మాట్లాడాలని సూచించాను. నేను మోదీ గుండెల్లో ఉన్నా.. ఆయన పక్కన నిల్చొని ఫొటో దిగాల్సిన అవసరంలేదు. ప్రధానితో అవసరమైన సందర్భంలో కచ్చితంగా 5 కోట్ల ఆంధ్రుల కోసం మాట్లాడతాను. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం, రైల్వేజోన్, ఉపాధి అవకాశాల కోసం మనం బలంగా నిలబడ్డామని ప్రజలు నమ్మారు.
Updated Date - Jul 16 , 2024 | 04:33 AM