హెచ్చరించినా మారలేదు!
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:46 AM
తిరుమల లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు.
ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యే పంపింది
టీటీడీ ల్యాబ్‌లో కల్తీని నిర్ధారించే పరికరాల్లేవు
ఇది సరఫరాదారులకు లాభించింది
నాణ్యత లేని సరుకు పంపుతున్నారు
వాసన, రుచి లేకపోవడంతో పరీక్షల కోసం
ఎన్‌డీడీబీకి గోప్యంగా పంపాం
జంతువుల కొవ్వు కలిపినట్లు తేలింది
ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో నివేదిక!
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా.. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నాసిరకం ట్యాంకర్లు పంపిందని.. అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టుల్లో తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఆదివారమిక్కడ సీఎంకు అందించారు. టీటీడీ ల్యాబ్‌లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని తెలిపారు. ‘టీటీడీకి 10 వేల కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీని ఈ-టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారు. ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్‌లో కిలో నెయ్యి రూ.319.80 చొప్పున రోజుకు పది వేల కిలోలు సరఫరా చేసేందుకు అంగీకరించింది. జూన్ 12న (చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజు) నుంచి సరఫరా ప్రారంభించింది. జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 15న మరో రెంటిని పంపించింది. వాసన, రుచి సరిగా లేకపోవడంతో.. ఆ నాలుగు ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని.. భారత ఆహార భద్రత-ప్రమాణాల అథారిటీ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అన్న నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించాం.
అదే నెల 16, 23వ తేదీల్లో నివేదికలు వచ్చాయి. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలున్నట్లు తేలింది. వెంటనే కల్తీ నెయ్యి ట్యాంకర్లను సదరు డెయిరీకి వెనక్కి పంపించేశాం. ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరాయే నిలిపివేశాం. 22, 23, 27వ తేదీల్లో వరుసగా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాం. వారిచ్చిన సమాధానంలో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తి మరోసారి ఆగస్టు 8న నోటీసులు జారీ చేశాం. దానికి ఆ కంపెనీ ఇచ్చిన తిరుగు జవాబును పరిశీలిస్తున్నాం. నెయ్యి కల్తీ సమస్య నేపథ్యంలో వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం నెయ్యి కొరత లేకుండా కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకున్నాం. టెండర్లు ఆహ్వానించగా నాలుగు డెయిరీ కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ (న్యూఢిల్లీ) ఎల్-1, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(నందిని)ను ఎల్-2గా ఎంపిక చేశాం. ఈ రెండు డెయిరీలు ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..
నిబంధనల్లో నాణ్యత సూచనలు ఉన్నా..
‘టీటీడీకి ప్రతిరోజూ 15 వేల కిలోల నెయ్యి అవసరం. నెయ్యి నిమిత్తం ఏటా రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నెయ్యి నాణ్యత టీటీడీ, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని టెండర్ల నిబంధనల్లో సృష్టంగా పొందుపరిచారు. టీటీడీ ఆవు నెయ్యి మొత్తం ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఇలాంటి సమయంలో 14 సాధారణ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తాం. టీటీడీ విధించిన టెండర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఎన్‌ఏబిఎల్ ఆక్రిటెడెట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయవచ్చునని సృష్టంగా ఉంది. కానీ టీటీడీ అధికారులు ఇప్పటి వరకూ ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌ల్లో నెయ్యిని పరీక్షించిన దాఖలాలు లేవు. నెయ్యి కల్తీ పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు రూ.74 లక్షలు ఖర్చవుతుంది. టీటీడీ ల్యాబ్‌ల్లో కల్తీని పరీక్షించే పరికరాలు లేకపోవడంతో దీనిని అదునుగా తీసుకుని నాణ్యత తగ్గిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల నెయ్యి ధరలు మరింత తగ్గిపోయాయి. పైగా నాణ్యమైన నెయ్యి అందించే సరఫరాదారులు రివర్స్ టెండరింగ్ వల్ల వెనక్కి వెళ్లిపోయారు. ఈ విధానంపై లోతైన సమీక్ష చేయాలి’ అని నివేదికలో తెలిపారు.
Updated Date - Sep 23 , 2024 | 08:25 AM