కష్టం.. నష్టం..
ABN, Publish Date - Sep 10 , 2024 | 04:14 AM
నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కుల లోపే ఉండటం..
కోలుకుంటున్న విజయవాడ
కళ్లముందు దైన్యం.. కళ్లలో ధైర్యం
వచ్చింది.. కొండంత కష్టం! మిగిలింది అపార నష్టం!
ఇంట్లోని వస్తువులెన్నో పోయాయి! ఉన్నవేమో ఇలా వరదతో బురద కొట్టుకుపోయాయి. ఏవి పనికొస్తాయో, ఎంత పనికొస్తాయో తెలియదు. కళ్లముందు కొండంత కష్టం! అదే సమయంలో ఈ కష్టాల నుంచి గట్టెక్కుతామనే ఽధైర్యం! బుడమేరు ముంపు బాధిత ప్రాంతమైన అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో మంగళవారం కనిపించిన చిత్రమిది! ఈనెల 1వ తేదీన బుడమేరు పొంగడంతో మొదలైన కష్టం నుంచి బెజవాడ వేగంగా కోలుకుంటోంది. బుడమేరు శాంతించింది. గండ్లు పూడ్చడంతోపాటు... పటిష్ఠం చేసే ప్రక్రియా కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో వరద చాలావరకు తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న మూడు కౌంటర్ వెయిట్ల అమరిక ముగిసింది. వరద బాధిత ప్రాం తాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం అహరహం శ్రమిస్తోంది.
కోలుకుంటున్న విజయవాడ
వీడిన వరద ముంపు.. వేగంగా సహాయక చర్యలు
వరదను సవాల్‌గా తీసుకున్న సర్కారు
వరద బాధితులకు ఆసాంతం అండగా..
గండ్ల పూడ్చివేతతో బుడమేరు శాంతం
ఇప్పుడు ఇన్‌ఫ్లో 2వేల క్యూసెక్కుల్లోపే
ఎంతో కలవరపరిచిన వాయుగుండం
అలాంటిదేమీ లేకుండానే తీరం దాటడంతో ఊరట
ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులూ పూర్తి
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
నిన్నటి వరకు వరద నీటిలో నానిన విజయవాడలోని ముంపు ప్రాంతాలన్నీ కుదుటపడ్డాయి. బుడమేరు ఇన్‌ఫ్లో రెండు వేల క్యూసెక్కుల లోపే ఉండటం.. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షం పడే అవకాశాలు లేకపోవడంతో విజయవాడకు ముప్పు దాదాపు తప్పినట్లే! మరోవైపు బుడమేరు డైవర్షన్ చానల్ గండ్లు పూడ్చివేసిన అధికారులు సోమవారం కట్టను బలోపేతంచేసి గండ్లు పూడ్చిన ప్రాంతాల్లో సీపేజీని అరికట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికి ఈ పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీపేజీ నివారణకు జియో టెక్సటైల్ మెటీరియల్ వినియోగిస్తున్నారు. తొలుత గండ్లు పడిన రెండు ప్రాంతాల్లో సీపేజీ 500 క్యూసెక్కులు ఉండగా అది సోమవారం నాటికి 200 క్యూసెక్కులకు తగ్గింది. మంగళవారం నాటికి పూర్తిగా తగ్గిపోతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కట్ట పటిష్ఠతను పెంచేందుకు గండ్లుపడిన చోట 5.7 మీటర్ల ఎత్తును... మరో 0.3 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో సుమారు 300 మంది నిమగ్నమయ్యారు.
ఫలించిన కష్టం..
బుడమేరు వరద సెప్టెంబరు 1వ తేదీన నగరాన్ని ముంచెత్తడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊహించని విపత్తుకు జిల్లా అధికారయంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి! అలాంటి సమయంలో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు...జిల్లా కలెక్టరేట్‌లోనే మకాం వేసి మంత్రులను, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులను పరుగులు పెట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల సిబ్బందిని విజయవాడ రప్పించి వరద సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దాని ఫలితమే అటు వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే ముంపు ప్రాంతాల్లో ముప్పేట సహాయక చర్యలకు అవకాశం లభించింది. మొత్తం మీద వారంరోజులుపైగా సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పడిన కష్టానికి ఫలితం దక్కింది.
తిరిగి సాధారణ స్థితికి..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిసాలోని పూరీ వద్ద తీరం దాటడంతో విజయవాడనగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే వారం రోజులుగా కుండపోత.. వరద తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు తాజా వాయుగుండంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాయుగుండం తీరం దాటడంతో వర్షాలూ తగ్గుముఖం పట్టాయి. సోమవారమంతా ఎలాంటి వర్షం లేకుండానే గడిచిపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలూ వేగవంతంగా సాగుతున్నాయి. ఆస్తి నష్టం అంచనా పనులు మొదలయ్యాయి. వ్యాధులపై కూడా డోర్ టు డోర్ సర్వే ప్రారంభించారు. వరద నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారికి తక్కువ ధరకు కూరగాయాలు అందించేందుకు 85 మొబైల్ రైతు బజార్లను వరద ప్రభావిత ప్రాంతాల్లో తిప్పుతున్నారు. వరద బాధితులకు నిత్యావసర కిట్లు పంపిణీ 50 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ మంగళ, బుధవారం నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
బ్యారేజీ వద్ద మరమ్మతులు పూర్తి
మర బోట్ల కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు సోమవారం పూర్తయింది. కేవలం ఐదు రోజుల్లో నీటిపారుదల శాఖ నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు పూర్తిచేయడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీ 67, 69, 70 నంబరు గేట్లు బోట్లు ఢీకొన్న కారణంగా దెబ్బతిన్నాయి. వాటి కౌంటర్ వెయిట్లు ధ్వంసం కావడంతో వాటి స్థానంలో కొత్తవాటిని బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకుంది. కన్నయ్యనాయుడిని రంగంలోకి దించింది. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఐదు రోజుల్లో బెకం కంపెనీ ఏర్పాటు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను మంగళవారం నాడు తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రులంతా సహాయక కార్యక్రమాల్లోనే
సాగునీటి వనరులు అన్నింటికీ మ్యాపింగ్: మంత్రి లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్‌గా సహాయ కార్యక్రమాలపై దృష్టి సారించామని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుడమేరు ముంపు బాధితులకు సాయం అందించడంలో మంత్రులంతా సమష్టిగా, సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. బుడమేరు అనుభవంతో నదులపై కంటే వాగులు, చెరువులపై దృష్టి పెట్టాల్సి ఉందని స్పష్టమైందని, రాష్ట్రంలోని అన్ని సాగునీటి వనరులనూ మ్యాపింగ్ చేస్తూ నిరంతరం సమీక్షిస్తామని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల అభివృద్ధితో పాటు వాగులు, ఏరులు, పెద్ద చెరువుల యాజమాన్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. గండ్లు పడిన ప్రాంతాల్లో లీకేజీని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోకేశ్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు జియో మెంబ్రేన్ షీట్‌లను వినియోగించి సోమవారం సాయంత్రానికల్లా లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే గండ్లు పడినచోట కట్ట 5.7 మీటర్ల ఎత్తు పెరిగింది. మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుతం ఉన్న కట్ట స్థాయికి పనులు పూర్తవుతాయి.
జగన్‌కు హుందాతనం ఉందా?
ప్రతిపక్ష నేత హోదా డిమాండ్ చేస్తున్న జగన్‌కు హుందాతనం ఉందా అని మంత్రి లోకేశ్ నిలదీశారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ ఎగిరిపోవాల్సిన జగన్... పాస్‌పోర్టు సమస్య కారణంగా బెంగళూరు ప్యాలె్‌సలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో క్షణం తీరికలేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్నారని, ఆయనపై విమర్శలు చేయడానికి మనసెలా వచ్చిందని జగన్‌ను నిలదీశారు. జగన్ అందించే సెల్ఫ్ చెక్కుల కథ అందరికీ తెలిసిందేనని అన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 04:15 AM