పోలవరం ప్రధాన పనులపై.. రేపటి నుంచే వర్క్‌షాపు
ABN, Publish Date - Nov 04 , 2024 | 04:28 AM
పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.
తొలి మూడ్రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలు
డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాంపై చర్చ
కాఫర్ డ్యాంలలో సీపేజీ నివారణపై సూచనలు
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మంగళవారం నుంచి అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖ, నిర్మాణ సంస్థలు బావర్, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో ఐదు రోజుల పాటు వర్క్‌షాప్ జరుగనుంది. మొదటి మూడ్రోజులూ క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటాయి. తొలిరోజున ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని నిపుణులు, అధికారులు పరిశీలిస్తారు. రెండోరోజు డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్తారు. మూడో రోజున ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతంలోని గ్యాప్‌లను పరిశీలిస్తారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీని అరికట్టడంపై సలహాలు ఇస్తారు. ఈ వర్క్‌షా్‌పలో నాలుగో రోజు అత్యంత కీలకంగా మారనుంది. ఆ రోజున సమీక్షలను ప్రాజెక్టు క్షేత్రం నుంచి రాజమహేంద్రవరానికి మార్చాలని యోచిస్తున్నారు. కొంతమంది నిపుణులు నాలుగో రోజునే తిరుగుప్రయాణం కానుండడమే దీనికి కారణం. రాజమండ్రి సమావేశంలో.. మెయిన్ డ్యాం నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారంభించాలి.. ఎప్పటిలోగా పూర్తిచేయాలి.. డిజైన్ల ఆమోదం తదితర అంశాలన్నిటినిపైనా జలసంఘం, పీపీఏ, అంతర్జాతీయ నిపుణులు, జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ, జర్మన్ కంపెనీ బావర్ అధికారులు, ప్రతినిధులు సమీక్షిస్తారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు చేపట్టడంపై ప్రధానంగా నిర్ణయం తీసుకుంటారు. వీటి డిజైన్లను ఎప్పటిలోగా ఆమోదించేదీ జలసంఘం డెడ్‌లైన్‌ను నిర్దేశించుకుంటుంది. పీపీఏ ద్వారా బావర్, మేఘా సమర్పించే డిజైన్లను ఎప్పటిలోగా ఆమోదిస్తారో వెల్లడిస్తుంది. కీలకమైన క్వాలిటీ కంట్రోల్‌పైనా కేంద్రం స్పష్టత ఇవ్వనుంది. ఈ బాధ్యతను వాప్కోస్ తీసుకుంటుంది. నాలుగు రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన ఆలోచనలపై వర్క్‌షాపు ఐదోరోజున సమగ్ర సమీక్ష జరుగుతుందని అంటున్నారు. కేంద్ర సంస్థల అధికారులు, నిపుణులంతా అదే రోజు నిష్క్రమిస్తారు.
3 నెలల గడువుపై బావర్‌తో పేచీ..!
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను వచ్చే జనవరి 2న ప్రారంభించాలని జలశక్తి శాఖ, రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించాయి. ఇందుకు బావర్, మేఘా ఆమోదం తెలిపాయి. అయితే దీనిని 2026 నవంబరుకల్లా పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుబడుతున్నాయి. బావర్ మాత్రం ప్రతికూల వాతావరణం, వరదల నేపథ్యంలో..2027 ఫిబ్రవరికి పూర్తిచేయగలమని చెబుతోంది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిల్లోనే ప్రాజెక్టు వద్ద వాతావరణం నిర్మాణానికి అనువుగా ఉంటుందని.. తుది పనులన్నీ అప్పుడు సమర్థంగా పూర్తి చేయగలుగుతామని అంటోంది. అయితే.. ఇప్పటికే తొలి డయాఫ్రం వాల్ నిర్మాణంలో అనుభవం వచ్చినందున.. 2026 నవంబరుకే నిర్మించాలని జలవనరులశాఖ అడుగుతోంది. తమపై ఒత్తిడి చేయవద్దని.. ఆ 3 నెలల సమయం ఇవ్వాల్సిందేనని బావర్ స్పష్టంచేస్తోంది. నవంబరుకల్లా వాల్ పూర్తయితే తక్షణమే ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించాలన్నది జలవనరుల శాఖ ఉద్దేశం. 2026 నవంబరులో ఆ పనులు మొదలుపెడితే.. ఫిబ్రవరిలోపు ఆ డ్యాం కూడా కొలిక్కి వస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బావర్, మేఘా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వద్ద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యోచిస్తున్నారు. ఈ భేటీ తర్వాత 3నెలల అదనపు గడువుపై బావర్ పట్టుసడలించవచ్చని భావిస్తున్నారు. ఐదేళ్ల జగన్ విధ్వంసం నుంచి తేరుకుని.. పోలవరం ప్రాజెక్టుకు కొత్తరూపాన్నిచ్చే మహా క్రతువుకు కేంద్ర, రాష్ట్ర సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ వర్క్‌షాపులో దీనిని త్వరగా పూర్తిచేసే దిశగా నిర్మాణాత్మకమైన ఆలోచనలు వస్తాయని జల వనరుల శాఖ ఆశిస్తోంది.
Updated Date - Nov 04 , 2024 | 04:28 AM