అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు
ABN, Publish Date - Apr 23 , 2024 | 05:07 AM
అవినీతి పార్టీకి ఓట్లు వేయవద్దని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. సిద్ధం అని వస్తున్న దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పండి
కలెక్షన్ కింగ్‌లుగా వైసీపీ ఎమ్మెల్యేలు
దోచుకుతిన్నారని సీట్లు మార్చేశారు
వెలిగొండకు తట్టెడు మట్టి పోశారా?
ప్రాజెక్టులకు గేట్లు బిగించలేని వ్యక్తి
వైఎస్‌కు వారసుడెలా అవుతాడు?
ఏటా ఇస్తామన్న జాబ్ కేలెండర్ ఏదీ?
జగన్‌పై చెల్లి షర్మిల మండిపాటు
ఎర్రగొండపాలెం/అద్దంకి, ఏప్రిల్ 22: అవినీతి పార్టీకి ఓట్లు వేయవద్దని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. సిద్ధం అని వస్తున్న దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, చీమకుర్తి, బాపట్ల జిల్లా అద్దంకిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా సిద్ధం అని ఎక్కడకు బయలుదేరారని వైసీపీ నేతలను నిలదీశారు. ‘‘చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఆయనకు సిగ్గుండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మీరు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ ఐదేళ్లలో తట్టెడు మట్టి పోశారా? వైఎ్‌సఆర్ శంకుస్థాపన చేసి 60శాతం పూర్తిచేసిన వెలిగొండను పూర్తిచేయకుండాఇన్నాళ్లు గాడిదలు కాశారా? వైఎస్ వారసులమని చెప్పుకోవడానికి సిగ్గులేదా? తాగునీరు, సాగునీరు లేక ప్రకాశం జిల్లాలో ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి కోసం పేదలు, రైతులు వలసలు వెళ్తున్నారు. ఏటా జనవరిలో ఇస్తామన్న జాబ్ కేలెండర్ ఏమైంది?’’ అని ముఖ్యమంత్రిని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తెచ్చారని మండిపడ్డారు. రూ.8లక్షల కోట్లు అప్పు చేయడమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమా అని ఎద్దేవా చేశారు. ‘ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే బాగా సంపాదించాడటగా... అన్ని కమీషన్లు ఈయనకేనట కదా... ఈయన మంచోడు అయితే ఇక్కడనుంచి ఎందుకు మార్చారు?’ అని ప్రశ్నించారు. ఇలాంటి చెత్త పార్టీలకు, ఓట్లు వేయడం అవసరమా? అని ప్రజలను షర్మిల ప్రశ్నించారు.
డబ్బులిస్తే తీసుకోండి.. అవి మీవే...
‘రాష్ట్రంలో మైన్, వైన్, ల్యాండ్, శాండ్ మాఫియా నడుస్తోంది. ఇష్టారాజ్యంగా దోచుకుతిన్నారని ఎమ్మెల్యేలను మార్చేశారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే కలెక్షన్ కింగ్.. క్వారీల నుంచి కమీషన్లు వసూలు చేయటంలో వసూలు రాజా. దోచుకుతిన్నాడని ఆయనకు సీటు ఇవ్వలేదట. అయినా వైసీపీకి ఓటు వేస్తారా? దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనటానికి వస్తారు. వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి. అవి మీ డబ్బులే... కానీ పవిత్రమైన ఓటును మాత్రం ఆలోచించి వేయండి’ అని ఓటర్లకు షర్మిల విజ్ఞప్తి చేశారు. ‘అంబటి రాంబాబు అంట.. గెలిస్తే మొత్తం ఎంపీలను బీజేపీకి ఇస్తాడట. ఇదీ వైసీపీ, బీజేపీ మధ్య ఉన్న దోస్తీ. లక్ష ఎకరాలకు సాగునీరు, ఒంగోలుకు తాగునీరిచ్చే గుండ్లకమ్మను వైఎ్‌సఆర్ పూర్తిచేస్తే ఆ ప్రాజెక్టు గేట్లు విరిగిపోయి రెండేళ్లయినా పట్టించుకోని జగనన్న... వైఎ్‌సకు వారసుడు ఎలా అవుతాడు?’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ఐదేళ్లలో జగన్ పెద్దపెద్ద కోటలు కట్టుకున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు.. ఇక సామాన్య ప్రజలను ఆయనేం కలుస్తారు’ అని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్ర భవిష్యత్ మారిపోయేదని, వేలసంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. చిన్నాన్నను చంపిన హంతకులకు జగన్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, ఏడాదికి ఇంటికి రూ.లక్ష, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు.
Updated Date - Apr 23 , 2024 | 05:07 AM