ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత ఇసుక దుర్వినియోగం కావొద్దు

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:39 AM

ఉచిత ఇసుక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

బ్లాక్‌ మార్కెటింగ్‌ను పూర్తిగా నిరోధించండి

ఇతర రాష్ట్రాలకు తరలించకుండా నిఘా

సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు

నిర్వహణ, రవాణా చార్జీల భారం తగ్గించాలి

ఇసుకపై సీనరేజీ ఫీజు రద్దు చేయాలి

ట్రాక్టర్‌ వెసులుబాటు దుర్వినియోగం కారాదు

గనుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ప్రైవేటు ఏజెన్సీలతో సరఫరాపై అధ్యయనం

ఉచిత ఇసుకపై సమీక్షలో కీలక నిర్ణయాలు

అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను పూర్తిగా నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా ప్రత్యేక టీమ్‌లతో నిరంతర నిఘా, పర్యవేక్షణ సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఉచిత ఇసుక పాలసీ అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. నిర్వహణ, రవాణా చార్జీల భారం తగ్గించేందుకు సాధ్యమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాను చెప్పినట్లుగా ఇసుకపై సీనరేజీ ఫీజు రద్దు చేయాలన్నారు. ప్రస్తుతం టన్ను ఇసుకపై 88 రూపాయల సీనరేజీ వసూలు చేస్తున్నారు. 20 టన్నుల లారీకి 1,760 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఉచితంగా ఇచ్చే ఇసుకకు సీనరేజీని మినహాయింపునిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని గనుల శాఖ అధికారులు నివేదించారు. ఈ సందర్భంగా జీఎస్టీ మినహాయింపుపై సీఎం ఆరా తీశారు. జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం ద్వారానే ఇసుకపై జీఎస్టీని మినహాయించగలమని అధికారులు నివేదించారు. ‘రాష్ట్రం తనకు తానుగా జీఎస్టీని మినహాయించలేదు. ఇసుకను జీఎస్టీలో 2505 కోడ్‌ కింద నమోదు చేశారు. నిర్మాణ రంగానికి ఇచ్చే ఇసుకపై 5 శాతం జీఎస్టీ ఉంటుంది. దీన్ని మినహాయించలేరు. అలాగే ఇసుక అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ ఉంది. దాన్ని మినహాయించాలంటే కేంద్ర జీఎస్టీ కౌన్సిల్‌లోనే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవడం కుదరదు. కావాలంటే ఉచిత ఇసుక లబ్ధిదారులు చెల్లించిన జీఎస్టీని ప్రభుత్వం తిరిగి వారికి రీయింబర్స్‌మెంట్‌ చేయవచ్చు. అది కూడా సాంకేతికంగా సంక్లిష్టమైనది. జీఎస్టీ మినహాయింపు అనేది కేవలం ఒకటి రెండు రాష్ట్రాల కోసం కాకుండా జాతీయ స్థాయిలో అమలయ్యేలా నిర్ణయించాలి. కాబట్టి ముందు ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదించాలి’ అని ఓ అధికారి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడుదామని సీఎం చెప్పినట్లు తెలిసింది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇసుక సరఫరాపై అధ్యయనం చేయాలని గనుల శాఖను సీఎం ఆదేశించారు.


ఆ జిల్లాల్లో ప్రైవేట్‌ స్టాక్‌యార్డ్‌లు

ఇసుక రీచ్‌, స్టాక్‌యార్డులు అందుబాటులో లేని జిల్లాల్లో ప్రత్యేక చర్యలతో ఇసుక లభ్యత తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మినరల్‌ డీలర్‌ లైసెన్సు(ఎండీఎల్‌) ఇచ్చి వారితో ఇసుక అందించే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు చర్చకొచ్చాయి. వీటిని కూడా పరిశీలన చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, నంద్యాల, ప్రకాశం, ఏలూరు తదితర జిల్లాల పరిధిలో ఇలాంటి విధానం చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ఇసుక స్టాక్‌యార్డులను తెరిచి తక్కువ ధరకే ఇసుక అమ్మకాలు చేపట్టేలా విధానం తీసుకురావాలన్నది ఈ ప్రతిపాదన సారాంశం.

వ్యక్తిగత అవసరాలకే ట్రాక్టర్‌ ఇసుక

గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్‌కు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల(జీఓ-64)ను కొందరు అప్పుడే తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఇసుకను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకునేందుకు లెక్కలేని విధంగా తరలించుకుపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. జీఓ 64 లక్ష్యాలు పక్కాగా అమలయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. కేవలం సొంత అవసరాలకే ట్రాక్టర్‌ ఇసుక అని, దాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారన్న విషయం తెలియజేయాలని ఆదేశించారు. వ్యక్తిగతంగా ట్రాక్టర్‌ ద్వారా ఇసుక తీసుకెళ్లాలంటే సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్టర్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 04:40 AM