Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:07 PM
గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచవరం మండలంలో సరస్వతి పవన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో వేమవరం, చెన్నాయపాలెంలోని భూములను విక్రయించాలంటూ ప్రజలు, రైతులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఆయా భూములను వారు విక్రయించారు. ఆయా భూముల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగవారం పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు.
నరసరావుపేట, నవంబర్ 05: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములకు సంబంధించిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మంగళవారం పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం.. వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు.
ఈ ప్రాంతంలో 400 ఎకరాల అటవీ భూములుంటే.. వాటిని రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. 2009లో ఈ భూములను 30 ఏళ్లకు లీజుకు తీసుకుని.. మళ్లీ వాటిని 50 ఏళ్లకు పెంచారని చెప్పారు. తాము పరిశ్రమ ఏర్పాటు చేసి.. అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి.. ఈ భూములు విక్రయించేలా నాటి పెద్దలు నమ్మబలికారన్నారు. ఇష్టం లేకున్నా.. ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకు వచ్చారని వివరించారు. అందుకోసం ప్రజలు, రైతులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు.
ఆ క్రమంలో పెట్రోల్ బాంబులు వేసి వారిని భయపెట్టారని గుర్తు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధించి వేధించి చంపేశారన్నారు. ఫర్నిచర్‌పై కోడెలను వేధించిన వ్యక్తి.. ప్లాంట్ పేరుతో భూములు లాక్కున్నారంటూ వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాల భూమిని భయపెట్టి మరీ తీసుకున్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.
అలా లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయని చెప్పారు. అయితే ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది హెచ్చరించారు. అలాగే 24.78 ఎకరాల కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. అలా భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం వ్యంగ్యంగా పేర్కొన్నారు.
సహాజ వనరులు ఒకరి సొత్తు కాదు.. ఒకరి సొంతం కాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక పోలీస్ ఉన్నతాధికారులు సైతం మెత్తబడిపోయారన్నారు. లేకుంటే వారు సైతం భయపడుతున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. స్థానిక యువతను గత ప్రభుత్వంలోని వారు భయపెడితే ఊరుకుంటారా? పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.
ప్రజలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులది కాదా? రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఇంకా తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. శాంతి భద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చూపించాలని పోలీస్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 03:15 PM