ప్రతి రూపాయీ రాబట్టండి
ABN, Publish Date - Jul 21 , 2024 | 04:25 AM
కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత వరకూ రాష్ట్రానికి నిధులు రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
కేంద్రం పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి
అమరావతి, పోలవరం, జల్ జీవన్
ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం
వెనుకబడిన ప్రాంతాలకూ రాయితీ పథకాలు
వంద కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు
విభజన హామీల అమలు జరగాలి
పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి
ఎంపీలు, మంత్రులతో భేటీలో చంద్రబాబు
నిధులు రాబట్టడంపై మార్గదర్శకం
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నిర్దేశం
ప్రతి 15 రోజులకూ సమీక్షిస్తానని వెల్లడి
అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత వరకూ రాష్ట్రానికి నిధులు రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు సూచించారు. కేంద్ర పథకాల కింద వచ్చే నిధులను వేటినీ వదలొద్దని, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపఽథ్యంలో ముఖ్యమంత్రి కేంద్రంపై ఫోకస్ పెట్టారు. కేంద్ర పఽథకాల నిధులు రాబట్టడం కోసం శనివారం తన నివాసంలో ఎంపీలు, మంత్రులతో ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఎంపీ రాష్ట్రంలోని మంత్రులతో కూడా సమన్వయం చేసుకొని కేంద్ర పథకాల్లో దేనిని ఏ మేరకు వినియోగించుకోవాలో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆదేశించారు. ఏదైనా పఽథకం కింద రూ.వంద కోట్లు వచ్చేలా ఉన్నా వదిలిపెట్టవద్దని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కూర్చుని తెచ్చుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తాను ఎంపీలు, మంత్రులకు అప్పగించిన పనిని సమీక్షిస్తానని, రాష్ట్రం పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పనిచేయాలన్నారు. ‘గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చి గ్రామాల్లో సిమెంటు రోడ్లు, నీటి కుంటలు, పశువుల శాలలు వంటివి భారీ సంఖ్యలో నిర్మించాం. అవన్నీ ఇప్పటికీ ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈసారి కూడా ఆ పథకం కింద ఎంత వీలైతే అన్ని నిధులు తెచ్చుకొందాం. అలాగే విభజన చట్టం కింద వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాయితీ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా మైక్రో ఇరిగేషన్ కింద తొంభై శాతం సబ్సిడీ పఽథకం అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. ఇది వస్తే రైతాంగానికి చాలా ఊరటగా ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
చేయాల్సిన పనులు ఇవీ
‘అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలి. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపకం జరిగేలా చూడాలి. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాం. గతంలో మంజూరైన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలోనే ఏర్పాటు చేయాలి. అవసరమైన నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయించుకోవాలి. కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడా లి. కడప ఉక్కుపైనా కేంద్రంతో చర్చలు జరపాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పు డు ప్రచారాలకు తెరదించాలి’ అని చంద్రబాబు సూచించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల ప్రస్తావన లేకపోతే తర్వాత అయినా తెచ్చుకోగలుగుతామని, దానిపై ఆందోళన చెందవద్దని ఒక ఎంపీ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Updated Date - Jul 21 , 2024 | 04:25 AM