అమరావతిలో రాజధాని నిర్మాణం తథ్యం
ABN, Publish Date - Jun 06 , 2024 | 01:44 AM
: అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిచేసి తీరతామని అమలాపురం ఎంపీ విజేత గంటి హరీష్‌మాధుర్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రనే తిరగరాసిందన్నారు.
అమలాపురం టౌన్, జూన్ 5: అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిచేసి తీరతామని అమలాపురం ఎంపీ విజేత గంటి హరీష్‌మాధుర్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రనే తిరగరాసిందన్నారు. ఇది ప్రజా విజయమన్నారు. నిజమైన అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునే రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం బుధవారం అమలాపురంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహం వద్ద తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అరకొర సంక్షేమంతో పాటు జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. సంక్షేమం పేరుతో దోపిడీ పాలన సాగించిందన్నారు. 2014-19లో జరిగిన అభివృద్ధి మాత్రమే నేడు కనిపిస్తోందని, వైసీపీలో అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. ఎన్డీయేతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని గుర్తించి ప్రజలు ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని నిలబెడతామన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పుట్టినరోజు నాడు టిక్కెట్టు ఇవ్వగా ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించి ఇస్తానన్న మాటను ప్రజలు నిలబెట్టారన్నారు. కోనసీమ రైల్వే లైన్ నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయడంతో పాటు పారదర్శక పాలన సాగిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఓఎన్జీసీ, వేదాంత, గెయిల్ వంటి చమురు సంస్థలతో చర్చిస్తానన్నారు. లంక గ్రామాల ప్రజలు కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో ఉన్నారని, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు, టూరిజం అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. ఎన్డీయేలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా టీడీపీ అధినేత తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హరీష్‌మాధుర్ సమాధానమిచ్చారు. మెట్ల రమణబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రైతులు, విద్యార్థులు, యువత, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సైకో పరిపాలనకు రాష్ట్ర ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు యాళ్ల నాగసతీష్, చిక్కాల గణేష్, నాయకులు నల్లా శ్రీధర్, యేడిద శ్రీను, బొర్రా ఈశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబు, నల్లా స్వామి, తిక్కిరెడ్డి నేతాజీ, మాకిరెడ్డి వీఎన్‌ఎస్ పూర్ణిమ, భాస్కర్ల రామకృష్ణ, వలవల శివరావు, గంధం శ్రీను పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2024 | 08:20 AM