ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:22 AM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి తగు న్యాయం చేసే విధంగా రెవెన్యూ, పోలీస్, న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ సూచించారు.
అమలాపురం, సెప్టెంబరు20(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించి తగు న్యాయం చేసే విధంగా రెవెన్యూ, పోలీస్, న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి పౌర హక్కుల రక్షణ ఎస్సీ, ఎస్టీ దురాగతాల నివారణ చట్టం అమలుపై ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులలో కేసులు సత్వర పరిష్కారం కోసం ఎటువంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కేసుల సత్వర విచారణకు అవసరమైన ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు తహసీల్దార్లు జారీ చేయాలన్నారు. ఉపాధి, పరిహారం మంజూరు విషయంలో జాప్యం జరగకుండా తక్షణం అమలు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం నష్ట పరిహారాలు అందించాలన్నారు. ప్రేరేపిత కేసులతో చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్ రెవెన్యూ అధికారులు డివిజన్ల వారీగా కేసులకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏవీఆర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జ్యోతిలక్ష్మిదేవి, ఆర్డీవో జి.కేశవర్ధన్‌రెడ్డి, ఎస్.సుధాసాగర్, జీవీవీ సత్యనారాయణ, డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 12:22 AM