సంక్రాంతి నాటికి పల్లె పండుగ పనులు పూర్తవ్వాలి
ABN, Publish Date - Dec 04 , 2024 | 12:46 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
అమలాపురం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పల్లె పండుగ పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ నమోదైన 24 గంటలలోపు సంబంధిత జిల్లా అధికారి గ్రీవెన్స్‌ను చూసి వారి శాఖల్లోని అధికారులకు కేటాయించాలన్నారు. నిర్దేశిత గడువులోగా అర్జీని పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో స్పష్టంగా స్పీకింగ్ ఆర్డరు ఇవ్వాలన్నారు. ప్రతీ అర్జీని మూడు స్థాయిల్లో ఆడిట్ నిర్వహిస్తున్నారన్నారు. రీసర్వే హద్దు రాళ్లపై పేర్లను తొలగించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతుల కోసం పీఏసీఎస్‌ల ద్వారా 800 టార్ఫాలిన్లు అందిస్తున్నామన్నారు.జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరైన 190 మరుగుదొడ్లు, 248 తాగునీటి వసతుల కల్పనను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వో వి.మదన్మోహనరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 04 , 2024 | 12:46 AM